
7 వేల ప్రదేశాల్లో యోగా
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు (అర్బన్): 11వ జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా వ్యాప్తంగా 7 వేల ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్ నుంచి శుక్రవారం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, కమిషనర్లు, ఇతర అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో యోగా కార్యక్రమాల్లో 10 లక్షల మంది పాల్గొనాలన్నారు. యోగా జరిగే ప్రతి ప్రదేశంలో ఒక యోగా ట్రైనర్‌తోపాటు ఒక ప్రత్యేకాఽధికారి ఉండేలా చూ డాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న యోగా ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయించాలన్నారు. అన్ని చోట్ల ఏఎన్‌ఎంలు ఉండేలా డీఎంహెచ్‌ఓ ఏర్పాట్లు చేయాలన్నారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొనే యోగా కార్యక్రమాలతో సమాంతరంగా జిల్లాలో యోగా కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్‌తోపాటు జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, డీఈఓ బాలాజీరావు, జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అధికారి యతిరాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.