
ఆశవర్కర్ల సమ్మె నోటీసు
నెల్లూరు (అర్బన్): ఆశ వర్కర్లకు రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వడంతోపాటు వారిని కార్మికులుగా గుర్తించాలని ఏపీ ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ సుజాతకు ఆశ కార్యకర్తలు జూలై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో భాగమవుతున్నామని, సమ్మె నోటీసు అందజేశారు. దుగ్గిరాల అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు టీబీ, లెప్రసీ, సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, ఫైలేరియా వంటి సర్వేలు చేస్తున్నారన్నారు. బాలింతలు, గర్భిణులను గుర్తించి వారికి పౌష్టికాహారం అందేలా కృషి చేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని రకాల వైద్య సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అదనంగా టీబీ నిర్ధాణ జరిపే గళ్ల పరీక్షలు చేయాలనడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కోశాధికారి మధుమాధవి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.