అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు
సరదాగా సాగిన యాత్ర ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు, ఓ బాలిక మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
● ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి
● ఐదుగురికి గాయాలు
● బాధితులది తిరుపతి జిల్లా
కొడవలూరు: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఓ బాలిక, ఓ వృద్ధుడు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని రాచర్లపాడు వద్ద శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన మహబూబ్‌బాషా కుటుంబం పదిమంది కారులో హైదరాబాద్ యాత్రకు వెళ్లింది. తిరిగి అదే కారులోనే సొంతూరికి బయలుదేరారు. కొడవలూరు మండలం రాచర్లపాడు సమీపంలో వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మస్తాన్ సాహెబ్ (67) అక్కడికక్కడే మృతిచెందారు. ఆయేషా (11) అనే బాలిక తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. కారు నడుపుతున్న మహబూబ్‌బాషాతోపాటు లోపల ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైవే మొబైల్ సిబ్బంది చొరవతో 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం నెల్లూరు వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారికి ప్రాణాపాయ పరిస్థితి లేదని వైద్యులు తెలిపినట్లు ఎస్సై కోటిరెడ్డి వెల్లడించారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తు కారణంగా అదుపుతప్పి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కళ్లెదుటే తండ్రి, మేనకోడలి మృతి
భాకరాపేటకు చెందిన మహబూబ్‌బాషా సొంత కారులో కుటుంబ సభ్యులను రెండు రోజుల క్రితం హైదరాబాద్ యాత్రకు తీసుకెళ్లాడు. అక్కడ వివిధ ప్రాంతాలను సందర్శించి సంతోషంగా తిరిగొస్తుండగా రాచర్లపాడు వద్ద ప్రమాదం జరిగింది. బాషా తండ్రి మస్తాన్ సాహెబ్, అక్క కూతురైన ఆయేషాలు మృతిచెందారు. కళ్లెదుటే తండ్రి, మేనకోడలు చనిపోవడం, మిగిలిన కుటుంబ సభ్యులు గాయపడటంతో బాషా కన్నీరుమున్నీరయ్యారు. క్షతగాత్రులు మృతులను చూసి రోదించడం స్థానికులను కలచి వేసింది.
విషాద యాత్ర
విషాద యాత్ర