
మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(టౌన్): జిల్లాలోని వలేటివారిపాళెం, లింగసముద్రంలోని టైప్ – 4 కేజీబీవీల్లో 2025 – 26 విద్యా సంవత్సరంలో తాత్కాలిక గెస్ట్ ఫ్యాకల్టీ (వార్డెన్, పార్ట్‌టైం టీచర్లు), డైలీ వేజ్ పద్ధతిలో నాన్ టీచింగ్ సిబ్బంది (హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్‌మెన్లు)కి సంబంధించి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వలేటివారిపాళెం ఆదర్శ పాఠశాలలో వార్డెన్ – 1, పార్ట్‌టైం టీచర్ – 1, హెడ్ కుక్ – 1, అసిస్టెంట్ కుక్ – 2, వాచ్‌మెన్ – 1, లింగసముద్రంలో వార్డెన్ – 1, పార్ట్‌టైం టీచర్ – 1, హెడ్ కుక్ – 1, అసిస్టెంట్ కుక్ – 2, వాచ్‌మెన్ – 1, ఉలవపాడు (వీరేపల్లి)లో వార్డెన్ – 1, పార్ట్‌టైం టీచర్ – 1, హెడ్ కుక్–1, అసిస్టెంట్ కుక్ – 2, వాచ్‌మెన్ – 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
విద్యుత్ షార్ట్
సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
● కుమార్తె పెళ్లికి నగదు తెచ్చిన బాధితుడు
● బూడిదైన రూ.2.50 లక్షల నగదు
కొండాపురం: మండలంలోని ఆదిమూర్తిపురం గ్రామంలో గురువారం రాత్రి రేకుల ఇల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తుల్లిబిల్లి కొండయ్య రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి మంటల్ని ఆర్పేలోపు కొండయ్య కుమారై వివాహానికి సమకూర్చుకున్న రూ.2.50 లక్షల నగదు, 4 సవర్ల బంగారం, గృహోపకరణాలు, వివిధ పత్రాలు, రేషన్, ఆధార్ కార్డులు దగ్ధమైనట్లు బాధితుడు తెలిపాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న తహసీల్దార్ కోటేశ్వరరావు, వీఆర్వో కొండయ్యలు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
కాకాణి బెయిల్
పిటిషన్ తిరస్కరణ
నెల్లూరు(లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులకు సంబంధించి నెల్లూరు ఐదో అదనపు జిల్లా (ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ) కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. రాజకీయ కక్షతో కేసులు పెట్టారని, బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ కేసు విచారణ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. గోవర్ధన్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ శుక్రవారం న్యాయమూర్తి సరస్వతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్‌ఎస్‌సీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(అర్బన్): స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నివేదించిన వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 23వ తేదీతో ముగుస్తుందని కలెక్టర్ ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుల భర్తీ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటేటివ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారన్నారు. దరఖాస్తులను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ హెచ్‌టీటీపీఎస్://ఎస్‌ఎస్‌సీ.జీఓవీ.ఇన్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. ఫీజును ఈనెల 24లోగా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దైవ దర్శనానికి వెళ్లగా..
● పది సవర్ల బంగారం, నగదు చోరీ
అల్లూరు: ఓ కుటుంబం తిరుమలలో దైవ దర్శనానికి వెళ్లగా దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లిన ఘటన అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని అంజి నాయుడు కాలనీలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కె.మహేష్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను కుటుంబంతో గురువారం ఉదయం తిరుమలకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం మహేష్ ఇంటి తలుపులు పగులగొట్టి ఉండగా స్థానికులు గుర్తించి అతడికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో మహేష్ తన బంధువులు, స్నేహితులను ఇంటి దగ్గరికి పంపాడు. పది సవర్ల బంగారం, రూ.70 వేల నగదును దొంగలు చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారం, నగదు దోచుకెళ్లారని, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.

మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం