
ప్రజలకు వేగంగా సేవలు : కలెక్టర్
● ఘనంగా రెవెన్యూ దినోత్సవం
నెల్లూరు(అర్బన్): ‘రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది దశాబ్దాల తరబడి ప్రజలతో నేరుగా సత్సంధాలు కలిగి ఉన్నారు. నేడు వచ్చిన ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని వారికి మరింత వేగంగా సేవలందించాలి’ అని కలెక్టర్ ఆనంద్ కోరారు. శుక్రవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో రెవెన్యూ దినోత్సవం ఘనంగా జరిగింది. నెల్లూరు కలెక్టరేట్‌లో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి అధ్యక్షతన వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అసోసియేషన్‌కు గెస్ట్‌హౌస్ నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే వచ్చేనెల 11వ తేదీ నుంచి మూడురోజులపాటు ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జేసీ కార్తీక్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో ఆ శాఖ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా రెవెన్యూ అకాడమీ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. అనంతరం పెంచలరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగిగా ప్రజలకు సేవచేసే అరుదైన అవకాశం ఉద్యోగులకు దక్కిందన్నారు. అనంతరం రిటైరైన పలువురు తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. అలాగే పాత్రికేయుడు వేలమూరి శ్రీధర్‌ను సత్కరించారు. తర్వాత ప్రజల్లో రెవెన్యూ శాఖ ఔన్నత్యాన్ని కాపాడుతామంటూ, జవాబుదారీగా పని చేస్తామని కలెక్టర్‌తోపాటు అధికారులు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, టీజీపీ స్పెషల్ కలెక్టర్ హుస్సేన్ సాహెబ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయకుమార్, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డానియేల్ పీటర్, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రజలకు వేగంగా సేవలు : కలెక్టర్