
కమనీయం.. వెంగమాంబ కల్యాణం
● వీక్షించి.. పరవశించిన భక్తజనం
● నేటితో ముగియనున్న ఉత్సవాలు
దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వెంగమాంబ, గురవయ్య ఉత్సవమూర్తులకు కల్యాణాన్ని నేత్రపర్వంగా బుధవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అశేష భక్తజనం వీక్షించి తన్మయత్వం చెందారు. తొలుత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన ఆలయం నుంచి వేదిక వద్దకు మంగళవాయిద్యాల నడుమ తీసుకొచ్చారు. అమ్మవారికి పట్టువస్త్రాలను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు సమర్పించారు. వెంగమాంబ పుట్టినిల్లయిన వడ్డిపాళెం నుంచి పసుపు, కుంకుమను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో దేవస్థానం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను వేదికపై ఉంచి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణాన్ని పచ్చవ, తుమ్మల, వేమూరి వంశస్తులు జరిపించారు. అనంతరం పల్లకిసేవ నిర్వహించారు.
అట్టహాసంగా ప్రతానోత్సవం
వడ్డిపాళెంలో హంసవాహనంపై వెంగమాంబ, గురవయ్య ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం బాణసంచాను కాలుస్తూ డప్పు, వాయిద్యాల నడుమ ప్రతానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దారిపొడవునా అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. నర్రవాడ పురవీధుల మీదుగా సాగింది.
నేటి కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం పొంగళ్లు పొంగించడం, ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బందోబస్తును పోలీసులు ఏర్పాపు చేయనున్నారు.

కమనీయం.. వెంగమాంబ కల్యాణం

కమనీయం.. వెంగమాంబ కల్యాణం