
ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు పోటీలు
సీతారామపురం : గ్రామదేవత మాతమ్మ తిరునాళ్లలో భాగంగా మండలంలోని సింగారెడ్డిపల్లి అరుంధతీయవాడలో ఎడ్ల బండలాగుడు పోటీలను బుధవారం నిర్వహించారు. ఆత్మకూరు మండలం గొల్లపల్లికి చెందిన మద్దిరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎడ్లు 20 నిమిషాల్లో 2,106.04 అడుగులు బండను లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. పొట్టేపాళేనికి చెందిన లెనిన్ ఎంటర్‌ప్రైజెస్ వారి ఎడ్లు 20 నిమిషాల్లో 2,067.3 అడుగులు లాగి ద్వితీయ స్థానాన్ని సాధించాయి. గండ్లవీడు, చిన్నమాచనూరుకు చెందిన ఏలూరి సుమంత్‌నాయుడు, మండవ హాజరత్‌నాయుడి ఎడ్లు 20 నిమిషాల్లో 1,526.8.. 1,514 అడుగులు బండలాగి తృతీయ, నాలుగో స్థానాల్లో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.పది వేల చొప్పున నగదు బహుమతులను అందజేశారు.