రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలో నెల్లూరు – ముంబై రహదారి నుంచి ఏఎస్‌పేట అడ్డరోడ్డుకు మలుపు తిరుగుతున్న కారును ఆత్మకూరు నుంచి నెల్లూరు మార్గంలో వెళ్తున్న టీవీఎస్ ఎక్సెల్ వేగంగా ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై ఎస్‌కే జిలానీ, ఏఎస్సై శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు.. తెలంగాణకు చెందిన ఓ కుటుంబం కారులో నెల్లూరు నుంచి ఏఎస్‌పేట దర్గా వద్దకు వస్తోంది. అదే క్రమంలో ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపల్లి గిరిజనకాలనీకి చెందిన పెంచలయ్య, యాకసిరి శ్రీనివాసులు అనే ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ ఎక్సెల్‌పై వేగంగా వస్తూ మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టారు. దీంతో పెంచలయ్య ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లినట్లు ఎస్సై జిలానీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


