
పక్కాగా భూముల రీసర్వే
● సైదాపురం మండలంలో
కలెక్టర్ పర్యటన
● వైద్య సిబ్బంది పనితీరుపై అసహనం
సైదాపురం: జిల్లాలో భూముల రీసర్వేను పక్కాగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే తీరును శుక్రవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా రికార్డులను చూశారు. రైతులతో మాట్లాడారు. సర్వే చేసే గ్రామాల్లో రెగ్యులర్ వీఆర్వోలను నియమించాలని తహసీల్దార్ రమాదేవిని ఆదేశించారు. సర్వేపై పలు ప్రశ్నలు వేశారు. గ్రామంలో మిగులు భూములున్నాయా?, వాటి స్థితిగతులు ఏంటని సర్వేయర్ వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. 255 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉందని చెప్పగా కలెక్టర్ స్పందించారు. భూమి లేని నిరుపేదలకు రెండెకరాల చొప్పున పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అసైన్‌మెంట్ కమిటీ ద్వారా పేదలకు ఆ భూములను కేటాయించడం జరుగుతుందన్నారు. సదరు భూములను కొందరు ఆక్రమించారని కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులతో ఆనంద్ సమీక్షించారు.
● కలెక్టర్ సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. మందుల స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. మందులు పంపిణీ చేయని వైనం వెలుగులోకి రావడంతో అసహనం వ్యక్తం చేశారు. అలాగే రోగుల గదిలో నీళ్లు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు.