
ఉపాధిలో అవినీతి తోడేళ్లు
‘ఆకులు నాకే వాడి మూతులు నాకుతున్నట్లు’ సామెత చందాన కందుకూరులోని ఉపాధి హామీ పథకం వ్యవస్థ తయారైంది. ఉపాధి పనుల్లో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే కూలీలకు వచ్చే అరకొర వేతనంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు కమీషన్లు ఇవ్వాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్‌ఏలు) వారి కడుపులు కొడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు టార్గెట్లు పెట్టి వారం వారం వేతనాల్లో కమీషన్లు వసూళ్లు చేసుకుంటున్నారు.
కందుకూరు రూరల్: ఉపాధి పథకం అవినీతి మయంగా మారింది. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు మామూళ్ల వసూళ్లు మామూలుగా లేదు. గతంలో నిరుద్యోగ యువతి, యువకులు మాత్రమే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధుల్లో ఉండేవారు. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో ఆయా పార్టీ నాయకులే ఫీల్డ్ అసిస్టెట్లుగా మారారు. దొంగ మస్తర్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు.
కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు మండలం కూలీల సంఖ్యలో టాప్‌లో ఉంది. కందుకూరు డ్వామా ఏపీడీ బాబూరావు కందుకూరు ఇన్‌చార్జి ఏపీఓగా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే ఏపీఓగా పనిచేస్తున్న సమీర్‌బాషా సెలవుపై వెళ్లడంతో పక్క మండల ఏపీఓకు ఇన్‌చార్జి ఇవ్వాల్సి ఉండగా ఏపీడీనే ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సదరు ఏపీడీ మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా ఫీల్డ్ అసిస్టెంట్ రూ.2 వేలు చేతిలో పెట్టాల్సిందేనట. గుడ్లూరు మండలంలోని ఓ పంచాయతీలో రూ.2 వేలకు రూ.300 డబ్బులు తగ్గడంతో తీసుకోలేదట. క్యాష్ లేకపోతే ఫోన్‌పే చేయమని చెబుతున్నాడని ఆ శాఖలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్ల విధుల విషయంలో టార్గెట్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఆయనపై వస్తున్న ఫిర్యాదులపై కందుకూరు ఎమ్మెల్యే పలుమార్లు పిలిపించి మందలించినట్లు సమాచారం.
అంతా ప్రహసనం
కందుకూరు నియోజకర్గంలో కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు, వలేటివారిపాళెం మండలాలు ఉన్నాయి. గుడ్లూరు మండలం ఉపాధి కూలీల హాజరులో జిల్లాలోనే టాప్‌లో ఉంది. ఈ నెల 10వ తేదీ మస్తర్లు పరిశీలిస్తే.. గుడ్లూరులో 6,962 మంది కూలీలు హాజరయ్యారు. కందుకూరులో 5,610, వలేటివారిపాళెంలో 5,740, లింగసముద్రంలో 4,342, ఉలవపాడులో 3,920 మంది కూలీలు హాజరైనట్లు మస్తర్లు ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో తరచూ ఏపీడీ, ఏపీఓలు పనుల పరిశీలకు వెళ్లినప్పుడు కూలీల సంఖ్య, ఆన్‌లైన్‌లో కూలీల సంఖ్యను పరిశీలించి సంతకాలు చేసి రావాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కందుకూరు ఎల్‌ఆర్‌సీ కోర్సు డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆయనకే ఇన్‌చార్జి ఏపీడీగా బాధ్యతలు ఇచ్చారు. ఆ ఇన్‌చార్జికే తిగిరి కందుకూరు ఏపీఓగా ఇన్‌చార్జి బాధ్యతలు. ఇలా ఈసీలు, టీఏలను ఆయనకు నచ్చిన వారినే తెచ్చుకుంటున్నాడు.
కింది స్థాయి నుంచి
పైస్థాయి వరకు మామూళ్లు
విజిట్‌కు వెళ్తే ఆ అధికారికి
రూ.2 వేలు చేతిలో పెట్టాల్సిందే
కూలీల కడుపులు కొట్టి కమీషన్లు కొట్టేస్తున్న ఎఫ్‌ఏలు
ఎడాపెడా మామూళ్లు
ఆ అధికారికి మామూళ్లు సమర్పించుకునే పేరుతో టీఏలు, ఈసీలు సైతం తమ జేబులు నింపుకునేందుకు ప్రతి కూలీ వద్ద వారానికి రూ.100 నుంచి రూ.200 వసూళ్లు చేస్తున్నారని సమాచారం. అయితే పంచాయతీని బట్టి మామూళ్ల రేటు పెరుగుతుందనే ప్రచారం ఉంది. కూలీ పనులకు రాని వారికి సైతం మస్తర్లు వేసి ఆ డబ్బులు ఫీల్డ్ అసిస్టెంట్ వసూలు జేబులో వేసుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జరుగుతోందని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పంచాయతీలో కనీసం వందకు తగ్గకుండా దొంగ మస్తర్లు ఉంటున్నాయి.