
ఇద్దరు యువకుల అరెస్ట్
● 6 కేజీల గంజాయి స్వాధీనం
నెల్లూరు (క్రైమ్): పూరి–తిరుపతి రైల్లో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను జీఆర్పీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి వారి నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంతకల్ రైల్వే ఎస్పీ రాహుల్‌మీనా ఆదేశాల మేరకు రైళ్లల్లో మత్తు, మాదకద్రవ్యాల అక్రమరవాణా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ఈ మేరకు రైల్వే సీఐ ఎ.సుధాకర్ తన సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కావలి, నెల్లూరు, గూడూరుల్లో ఒడిశా నుంచి బెంగళూరు, చైన్నె వైపు వెళ్లే రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో పూరి–తిరుపతి వెళ్లే రైల్లో తనిఖీలు చేపట్టగా కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన ముహమ్మద్ ఉబయ్ ఎస్‌పీపీ, కేరళ రాష్ట్రం ఎర్నాకులం పట్టణానికి చెందిన సాధిక్యూ పీఏ అనే ఇద్దరు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.60 వేలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తమ ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించడంతో వారిని అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్, ఎస్‌ఐ ఎన్.హరిచందన, సిబ్బంది రవి, వెంకటేశ్వర్లు, మణికంఠలను డీఎస్పీ అభినందించారు.