
13వ రోజుకు చేరిన సీహెచ్‌ఓల నిరసన
నెల్లూరు(అర్బన్): న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపే ప్రసక్తేలేదని సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఆదిల్ అన్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మూసేసి నెల్లూరులోని జిల్లా వైద్యశాఖ కార్యా లయం వద్ద సీహెచ్‌ఓలు (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు) చేస్తున్న నిరసన దీక్షలు శనివారం నాటికి 13వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆదిల్ మాట్లాడుతూ తమ ఆందోళనలకు ప్రభుత్వం స్పందించకపోవడంతో నల్లమాస్క్‌లతో కళ్లకు గంతలు కట్టుకుని న్యాయం చేయాల ని న్యాయదేవతను వేడుకున్నామన్నారు. ఇప్పటికై నా తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని, జాతీయ ఆరోగ్యమిషన్ ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతనం పెంచాలని, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల అద్దెలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భానుమహేష్, నాయకులు సురేష్, కృష్ణవేణి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.