
ఘనంగా మెడికల్ కళాశాల ఫ్రెషర్స్ డే
నెల్లూరు(అర్బన్): దర్గామిట్టలోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం వైద్య విద్యనభ్యసిస్తున్న వారికి మూడో సంవత్సరం విద్యార్థులు శుక్రవారం ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ గోవిందు మాట్లాడుతూ డాక్టర్ వృత్తి పవిత్రమైనదన్నారు. కళాశాల మంచి ఫలితాలతో గుర్తింపు తెచ్చుకుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా చదివి మంచి డాక్టర్లుగా మారి ప్రజలకు సేవలందించాలన్నారు. సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను నేర్చుకుని సమాజానికి ఉపయోగపడాలన్నారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్‌బాషా మాట్లాడుతూ ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడం అంటే చాలా గొప్ప విషయమన్నారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
● ఉగ్రదాడిలో మృతిచెందిన పర్యాటకులు, దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీనాయక్, ఇంకా పౌరులకు మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కాలేషాబాషా, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.