
లీజు ముగిసిన గనుల స్వాధీనానికి వినతి
సైదాపురం: మండలంలో లీజు ముగిసిన గనులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర నృత్య అకాడమీ మాజీ చైర్‌పర్సన్ పొట్టేళ్ల శిరీషాయాదవ్ కోరారు. ఈ మేరకు నెల్లూరు ఆర్డీఓ అనూషకు వినతిపత్రాన్ని గురువారం అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. క్వార్ట్‌జ్ ఖనిజాన్ని మేజర్ మినరల్‌గా భారత గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించిందన్నారు. ఈ క్రమంలో గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం – 1957 మేరకు ఇక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ జరగకూడదని చెప్పారు. నెల్లూరు ఎంపీ తన అనుచరుడితో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, ఈ క్రమంలో గనులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు.
రైతులకు
పరిహారాన్ని పెంచాలి
ఆత్మకూరు: ఆత్మకూరు డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేలైన్‌కు సంబంధించిన భూసేకరణలో తమకు పరిహారాన్ని పెంచాలని రైతులు కోరారు. ఈ మేరకు ఆత్మకూరు ఆర్డీఓ పావనికి వినతిపత్రాన్ని గురువారం అందజేశారు. మండలంలోని అప్పారావుపాళెం, మురగళ్ల మీదుగా రైల్వేలైన్ నిర్మాణం జరుగుతున్న క్రమంలో భూసేకరణ కోసం రైతులతో ఆర్డీఓ, రైల్వే అధికారులు ఇటీవల సమావేశమయ్యారు. అప్పారావుపాళెంలో 48 ఎకరాలను సేకరించనుండగా, ఎకరాకు రూ.7.6 లక్షల నుంచి రూ.తొమ్మిది లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్కెట్ విలువ ఎకరా రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉందని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెంచాలని కోరారు. మరోవైపు రైల్వేలైన్ నిర్మాణానికి 8.5 మీటర్ల ఎత్తుగా కట్టపోసి నిర్మించనున్నారని, దీంతో పెన్నాకు వరదలొచ్చిన సమయంలో అప్పారావుపాళెం, కొత్తపాళెం, బట్టేపాడు, నల్లపరెడ్డిపల్లి, మురగళ్ల గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు
జవాబుదారీగా ఉండాలి
నెల్లూరు రూరల్: రెవెన్యూ సేవలను ప్రజలకు అందించే క్రమంలో జవాబుదారీతనంగా ఉండాలని జేసీ కార్తీక్ సూచించారు. రీసర్వే డిజిటలైజేషన్, నోషనల్ ఖాతాలు, నీటి తీరువా పన్నుల వసూలు, సిటిజన్ సర్వీసెస్ తదితర అంశాలపై నెల్లూరు డివిజన్ తహసీల్దార్లతో తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా రీసర్వేను పూర్తి చేయాలని కోరారు. రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా ముందుగా రెవెన్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న రికార్డుల జాబితాను రూపొందించాలని సూచించారు. రైతుల నుంచి నీటి తీరువా పన్నులను వసూలు చేయాలని కోరారు. డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, ఆర్డీఓ అనూష, సర్వే ఏడీ నాగశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల నుంచి
దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయులకు వచ్చే నెల ఐదు నుంచి 11 వరకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాల్లో రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా పనిచేసేందుకు అనుభవజ్ఞులైన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను amonellore2819@ gmail.com లేదా వాట్సాప్ నంబర్ 94417 00940కు పంపాలని సూచించారు.
పంచాయతీ
సెక్రటరీ సస్పెన్షన్
నెల్లూరు (పొగతోట): వింజమూరు పంచాయతీ సెక్రటరీ శివకుమార్‌ను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ సెక్రటరీ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. కోవూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేసే సమయంలో రూ.1,16,66,878 మేర నిధుల దుర్వినియోగంతో పాటు ఇతర అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని రుజువు కావడంతో సస్పెన్షన్ వేటేశారు.

లీజు ముగిసిన గనుల స్వాధీనానికి వినతి