
కలెక్టరేట్ ఎదుట నిరసన
సాక్షిపై అక్కసు
కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయి. పాలనలో వైఫల్యం.. సంక్షేమ పథకాల అమల్లో నిర్లిప్తత.. వెరసి ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ అంశాలను ప్రశ్నిస్తున్న గొంతుకలపై ఉక్కుపాదం మోపుతోంది. పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ.. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వికటాట్టహాసం చేస్తోంది. సర్కార్ వైఫల్యాలపై నిరంతరం కథనాలను ప్రచురిస్తున్న సాక్షిపై నిరంకుశ వైఖరికి తెరలేపింది. ఇందులో భాగంగా పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై తన అక్కసును ప్రదర్శించింది. సోదాల పేరుతో విజయవాడలోని ఆయన ఇంటికి పోలీసులను గురువారం పంపి కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టి పైశాచికానందాన్ని పొందింది. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా చోటుచేసుకున్న ఈ పరిణామాలపై మేధావులు, విద్యావేత్తలు, పాత్రికేయులు భగ్గుమంటున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి నెట్‌వర్క్
నెల్లూరు రూరల్: జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ.. అక్రమ కేసులు బనాయించి భయాందోళనలకు గురిచేస్తోందని పాత్రికేయులు ఆరోపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎలాంటి నోటీసులివ్వకుండా సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యంగా సోదాలు నిర్వహించడం దారుణమంటూ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్ట్ ఐక్యవేదిక నేతలు నల్ల రిబ్బన్లతో గురువారం నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో ఉదయభాస్కర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జర్నలిస్టుల గొంతు నొక్కేందుకే ఇలాంటి పోకడలకు తెరలేపారని మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించి పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. హజరత్తయ్య, కృష్ణారెడ్డి, సాంబశివరావు, హరి, సింగ్, యోగానందరెడ్డి, శ్రీనివాసులు, కమల్, విజయకృష్ణ, మాల్యాద్రి, వెంకట్రావు, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ఎదుట నిరసన