
రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న అనిల్‌కుమార్
● టీడీపీ నేత నారాయణపై
ధ్వజమెత్తిన ఎమ్మెల్యే అనిల్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): పద్దెనిమిది కోట్ల పెట్టుబడి పెట్టి రూ.800 కోట్లను మాజీ మంత్రి నారాయణ స్వాహా చేశారని, పెద్ద మనిషి ముసుగులో దందా సాగించే వారిని వైట్‌కాలర్ నేరస్తులంటారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. నగరంలోని 48వ డివిజన్ పొర్లుకట్టలో రూ.1.5 కోట్లతో నిర్మించనున్న రోడ్డు, డ్రెయిన్లకు శంకుస్థాపనను శుక్రవారం చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పొర్లుకట్టలో పర్యటిస్తున్న సమయంలో సమస్యను స్థానికులు తెలియజేశారని, ఈ నేపథ్యంలో శంకుస్థాపనను చేపట్టామని వివరించారు. ఇప్పటి వరకు రూ.తొమ్మిది కోట్లతో డివిజన్లో అభివృద్ధి పనులను చేపట్టామని వెల్లడించారు. నగరాన్ని ఎవరు అభివృద్ధి చేశారనే అంశమై చర్చకు ఆహ్వానిస్తే.. ఎందుకు రావాలనడం హాస్యాస్పదమన్నారు. నెల్లూరును స్మార్ట్ సిటీగా ఎందుకు మార్చలేకపోయారని ప్రశ్నించారు. హడ్కో నుంచి గతంలో రూ.800 కోట్లను తీసుకొచ్చిరుణ భారాన్ని ప్రజలపై మోపారని, ఈ క్రమంలో తమ ప్రభుత్వం రూ.600 కోట్లను భరించిందని గుర్తుచేశారు. నారాయణకు హాస్పిటల్ ఉన్నా, ఏ ఒక్కరికై నా ఉచితంగా వైద్యం చేశారానని ప్రశ్నించారు. డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్‌చార్జి సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.