సమగ్ర శిక్ష : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారట | Samagra Shiksha Abhiyaan became the loop line | Sakshi
Sakshi News home page

సమగ్ర శిక్ష : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారట

May 3 2023 12:14 AM | Updated on May 4 2023 7:31 PM

- - Sakshi

సమగ్ర శిక్షలో కొంత కాలం పనిచేస్తే చాలు బాగా సంపాదించవచ్చు. జిల్లా విద్యాశాఖలో ఎక్కువగా వినిపించే మాట ఇది. ఆ శాఖలో రూ.వందల కోట్లతో పనులు జరుగుతుంటాయి. ఇందుకే డెప్యుటేషన్‌ పద్ధతిలో పనిచేసేందుకు అనేకమంది పోటీ పడుతుంటారు. అలా వచ్చిన వారు అక్రమాలకు తెరలేపి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అందిన కాడికి దోచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు సమగ్ర శిక్ష ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.

సమగ్ర శిక్షలో ఉన్నతాధికారి అండదండలతో కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 2021 సంవత్సరం డిసెంబర్‌ 4వ తేదీన ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ (ఐఈ) కో–ఆర్డినేటర్‌గా ఒకరు ఫారిన్‌ సర్వీస్‌ మీద విధుల్లో చేరారు. అదే 16వ తేదీన ఐఈ విభాగం ఆధ్వర్యంలో నెల్లూరులోని ఎమ్మార్సీలో మెడికల్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందుకు సంబంధించి రూ.1.50 లక్షల ఖర్చు అయినట్లు లెక్కలు చూపించారు.

సాధారణంగా బిల్లులు ఆ సెక్షన్‌ సూపరింటెండెంట్‌, అధికారి సంతకం చేసిన తర్వాత సమగ్ర శిక్ష ఏపీసీ (అడిషనల్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌)కి పంపిస్తారు. అక్కడ ఆ అధికారి పరిశీలించి సంతకం పెట్టాక బిల్లు పాస్‌ అవుతుంది. అయితే ఈ బిల్లుపై ఐఈ విభాగం సూపరింటెండెంట్‌, కో–ఆర్డినేటర్‌ సంతకం లేకుండానే పాస్‌ చేశారు. ఏ విధంగా పాస్‌ చేశారన్న దానిపై పరిశీలిస్తే ఆ బిల్లులపై నాడు–నేడు పేరుతో పర్యవేక్షణకు డెప్యుటేషన్‌పై వచ్చిన ఓ అధికారి ఈ ఏడాది జనవరి 23వ తేదీన సంతకం చేసినట్లు ఉంది.

దీంతో ఈ బిల్లులపై ఏపీసీ సంతకం కూడా చేసి పాస్‌ చేశారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇంకా భవిత సెంటర్లు ఐఆర్పీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటివి ఈ ఒక్క సెక్షన్‌లోనే కాదు సీఎంఓ, ఏఎంఓ విభాగాల్లో కూడా జరిగినట్లు ప్రచారం ఉంది. ఇంకా కొన్ని విభాగాల్లో పనులు చేయకుండా, కార్యక్రమాలు నిర్వహించకుండానే నకిలీ బిల్లులు పెట్టి నగదు డ్రా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

నెల్లూరు(టౌన్‌): సమగ్ర శిక్షకు డెప్యుటేషన్‌పై వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. సిఫార్సులు లేదా డబ్బు సమర్పించి ఇక్కడికి వచ్చేందుకు పోటీ పడుతుంటారు. ప్రధానంగా వివిధ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో అవసరం లేకున్నా ఉద్యోగుల కొరత పేరుతో డెప్యుటేషన్‌పై వస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు ఈ శాఖకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ప్రస్తుతం సమగ్ర శిక్షలో మొత్తం ఏడుగురు ఉద్యోగులు డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరితోపాటు మరికొందరు కూడా ఉన్నట్లు సమాచారం. వాస్తవంగా ఏప్రిల్‌ 30వ తేదీన డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులందరూ తమ పాఠశాలల్లో చేరాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. అయినా వారు ఆ శాఖ ఉన్నతాధికారి కనుసన్నల్లో మెలుగుతూ ఇక్కడే ఉండేందుకు పావులు కదుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. డెప్యుటేషన్‌పై వచ్చిన ఓ ఉపాధ్యాయుడు మూడు సంవత్సరాలుగా సమగ్ర శిక్షలోనే వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని చెబుతున్నారు.

హాజరుతో పనిలేదు

ఆయా పాఠశాలల నుంచి డెప్యుటేషన్లపై వచ్చిన ఉద్యోగుల అటెండెన్స్‌ను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమగ్ర శిక్షకు వచ్చిన ఉద్యోగుల అటెండెన్స్‌ను ఏ రోజుకా రోజు వారి మాతృ పాఠశాలకు పంపించాల్సి ఉంది. అక్కడి నుంచే నెలవారీ జీతాలు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు విధులకు హాజరు కాకుండానే.. తర్వాత ఒక్కసారిగా అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారని తెలిసింది. అటెండెన్స్‌ రిజిస్టర్‌లో ఎక్కడా దిద్దకూడదు. అయితే సమగ్ర శిక్ష అటెండెన్స్‌లో ఎక్కువగా దిద్దుబాట్లు ఉంటున్నాయని ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేసే ఉన్నతాధికారి అండదండలతోనే ఇలా జరుగుతోందని ఆ శాఖ సిబ్బంది చెబుతున్న మాట.


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

మెడికల్‌ అసెస్‌మెంట్‌ బిల్లును పరిశీలించి ఆ బిల్లుపై వేరే వారి సంతకం ఉంటే ఆ సెక్షన్‌ సూపరింటెండెంట్‌కు తక్షణమే మెమో జారీ చేస్తాం. పనులు జరుగుతున్నందున వారు డెప్యుటేషన్లలో కొనసాగుతున్నారు. అటెండెన్స్‌ విషయంలో రోజూ హాజరును వారి మాతృ పాఠశాలలకు పపంపించాలని సూపరింటెండెంట్‌కు ఇప్పటికే చెప్పాను. ఈ విషయాలపై తప్పకుండా పరిశీలించి తప్పులు జరిగితే చర్యలు తీసుకుంటాం.

– ఉషారాణి, ఏపీసీ, సమగ్ర శిక్ష

బిల్లుపై ఐఈ కో–ఆర్డినేటర్‌ బదులు వేరే వారి సంతకం ఉన్న దృశ్యం 1
1/1

బిల్లుపై ఐఈ కో–ఆర్డినేటర్‌ బదులు వేరే వారి సంతకం ఉన్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement