
ఇంగ్లండ్‌తో జింబాబ్వే టెస్టు
ఇరు జట్ల మధ్య నాలుగు రోజులు కొనసాగనున్న మ్యాచ్
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌కు ఇక ఈ ఏడాదంతా బిజీ షెడ్యూల్ వుంది. మేటి జట్లతో కీలకమైన ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడాల్సి ఉంది. అలాంటి ఇంగ్లండ్ జట్టు తమ సొంతగడ్డపై జింబాబ్వేలాంటి కూనతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. 22 ఏళ్ల తర్వాత జింబాబ్వేతో జరుగుతున్న ఈ ఏకైక టెస్టును ఆతిథ్య జట్టు గెలుపోటములతో సంబంధం లేకుండా నూటికి నూరు శాతం సన్నాహక మ్యాచ్‌గా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఎందుకంటే వచ్చే నెలలోనే ఇక్కడ పర్యటించేందుకు భారత్ వస్తోంది.
అనంతరం ఈ సీజన్‌లోనే ఆ్రస్టేలియా గడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లనుంది. ఇవన్నీ కూడా ఐదేసి మ్యాచ్‌ల పూర్తిస్థాయి సిరీస్‌లు. ఈ 10 టెస్టులకు ముందు ఇంగ్లండ్ ఓ క్రికెట్ కూనపై నాలుగు రోజులు ప్రతాపం చూపనుంది. టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం కానీ ఈ టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్ ఇచ్చే ప్రాధాన్యత అంతా తదుపరి సన్నద్ధం కోసమేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గురువారం నుంచి జరిగే ఈ సంప్రదాయ పోరులో జింబాబ్వే ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి.
18 ఏళ్ల క్రితం కేప్‌టౌన్‌లో టి20 ప్రపంచకప్ ఆడినప్పటికీ అసలైన టెస్టు మ్యాచ్‌ను జింబాబ్వే చివరిసారిగా 2003లో ఆడింది. ఆ సిరీస్‌లోనే 20 ఏళ్ల అండర్సన్ పేస్ బౌలర్‌గా అరంగేట్రం చేశాడు. ఇన్నేళ్లలో ఓ వెలుగువెలిగిన అండర్సన్ రిటైర్ కూడా అయ్యాడు. మరోవైపు జింబాబ్వే మాత్రం దేశంలోని రాజకీయ అస్థిరత, ఆరి్థక సంక్షోభం, క్రికెట్ బోర్డులో మితిమీరిన ప్రభుత్వ జోక్యం తదితర సమస్యలతో సతమతమైంది. ఆరేళ్ల పాటు పూర్తిగా టెస్టు క్రికెట్‌కు దూరమైంది.
2005 నుంచి 2011 అసలు సంప్రదాయ సమరమే లేకుండా గడిపిన జింబాబ్వే ఆ తర్వాత కూడా పూర్తిస్థాయి సిరీస్‌లను ఆడే అవకాశాన్ని కోల్పోయిందనే చెప్పాలి. 2022 నుంచి 2024 వరకు ఈ జట్టు కేవలం నాలుగంటే నాలుగు టెస్టులే ఆడిందంటే జింబాబ్వే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
» జింబాబ్వే రెండోసారి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇంతకుముందు 2017లోనూ దక్షిణాఫ్రికాతో కూడా జింబాబ్వే నాలుగు రోజుల టెస్టు ఆడింది.
» మరోవైపు ఇంగ్లండ్ కూడా రెండోసారి నాలుగు రోజుల టెస్టు ఆడబోతుంది. 2023లో ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ తొలిసారి నాలుగు రోజుల టెస్టులో పోటీపడింది. ఈ రెండింటికంటే ముందు 1973లో న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మొదటిసారి నాలుగు రోజుల టెస్టు జరిగింది.
14 జింబాబ్వే జట్టు 1992 నుంచి ఇప్పటి వరకు మొత్తం 123 టెస్టులు ఆడింది. 14 టెస్టుల్లో విజయం సాధించి, 79 టెస్టుల్లో ఓడిపోయింది. 30 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.
3 ఇంగ్లండ్ జట్టుతో ఓవరాల్‌గా జింబాబ్వే 6 టెస్టులు ఆడింది. 3 టెస్టుల్లో ఓడిపోయి, 3 టెస్టులను ‘డ్రా’ చేసుకుంది.