Yuvraj-Mohammad Asif: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పాల్పడిన వ్యక్తితో ఫోటో అవసరమా.. యువీకి చురకలు

Yuvraj Singh Meets Mohammad Asif In USA Photo Viral But Fans Criticized - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రస్తుతం అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నాడు. వర్జీనియా వేదికగా జరగనున్న యునిటీ క్రికెట్‌  టోర్నమెంట్‌లో భాగంగా పాల్గొనే యువ క్రికెటర్లకు యువీ తన సలహాలు అందించనున్నాడు. ఇదే టోర్నీకి పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ కూడా వచ్చాడు. చాలాకాలం తర్వాత ఈ ఇద్దరు ఎదురుపడడంతో ఒకరినొకరు పలకరించుకొని ఫోటోకు ఫోజిచ్చారు. కాగా ఈ ఫోటోను మహ్మద్‌ ఆసిఫ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ''స్నేహానికి ఎలాంటి హద్దులు ఉండవు'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఆసిఫ్‌ షేర్‌ చేసిన ఫోటో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. 

అయితే యువరాజ్‌ ఆసిఫ్‌తో ఫోటో దిగడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ రెండుగా చీలిపోయారు. చిరకాల ప్రత్యర్థులుగా కనిపించే రెండు దేశాల నుంచి ఇద్దరు క్రికెటర్లు ఒకేచోట కలిసి ఫోటో దిగడం ఆనందంగా అనిపించిదని కొందరు కామెంట్స్‌ చేయగా.. మరికొందరు మాత్రం మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ ఒక ఆటగాడితో ఎలా ఫోటో దిగుతావు అంటూ మరికొందరు యువరాజ్‌ను తప్పుబట్టారు. అయితే యువరాజ్‌ తనంతట తానుగా ఈ ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేయలేదని.. పాక్‌ క్రికెటర్‌ ఆసిఫ్‌ మాత్రమే షేర్‌ చేసుకున్నాడని.. ఇందులో యువరాజ్‌ తప్పేమి లేదని పేర్కొన్నారు. 

కాగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతం పక్కనబెడితే మహ్మద్‌ ఆసిఫ్‌ స్వతహాగా సూపర్‌ బౌలర్‌. ఫాస్ట్‌ బౌలింగ్‌కు పెట్టింది పేరైన ఆసిఫ్‌ మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడు. పాకిస్తాన్‌ తరపున 72 మ్యాచ్‌లాడిన ఆసిఫ్‌ 168 వికెట్లు తీశాడు. అయితే 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మహ్మద్‌ ఆసిఫ్‌ ఆది నుంచి వివాదాలే చుట్టుముట్టాయి. నిషేధిత డ్రగ్స్‌ వాడి ఒకసారి సస్పెండ్‌ అయిన ఆసిఫ్‌.. 2010లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.

అందుకు అనుగుణంగా ప్రీ ప్లాన్‌గా ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్స్‌ వేశాడు. ఫిక్సింగ్‌ ఆరోపణలు నిజమని తేలడంతో మహ్మద్‌ ఆసిఫ్‌పై ఐసీసీ ఏడేళ్ల నిషేధం విధించింది. ఆసిఫ్‌తో పాటు సల్మాన్‌ భట్‌, మహ్మద్‌ ఆమిర్‌లపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అయితే 2015లో ఐసీసీ ఆసిఫ్‌పై విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకొని అన్ని ఫార్మాట్లలో ఆడొచ్చంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఆసిఫ్‌ కొద్దిరోజులకే ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

చదవండి: Chris Lynn: ఆ బ్యాటర్‌ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top