Satender Malik: రిఫరీపై అమానుష దాడి.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం

Wrestler Satender Malik Assault Referee CWG Trials  WFI Imposed Life Ban - Sakshi

రెజ్లింగ్‌ ట్రయల్స్‌లో జగడం

రెజ్లర్‌ సతేందర్‌పై చేయి చేసుకున్న రిఫరీ

తిరిగి రిఫరీని కొట్టిన సతేందర్‌ 

రెజ్లర్‌పై జీవితకాల నిషేధం విధించిన డబ్ల్యూఎఫ్‌ఐ

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత పురుషుల రెజ్లింగ్‌ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో అనుచిత ఘటన చోటు చేసుకుంది. బౌట్‌లో అప్పటిదాకా గెలుపు ధీమాతో ఉన్న సర్వీసెస్‌ రెజ్లర్‌ సతేందర్‌ మలిక్‌ ఫలితం బౌట్‌ వెలుపలి జోక్యంతో మారింది. ప్రత్యర్థికి అనుకూలంగా పాయింట్లు ఇచ్చిన విధానంపై రిఫరీ జగ్బీర్‌ సింగ్‌ను సతేందర్‌ ప్రశ్నించాడు. ఇది సహించలేని రిఫరీ జగ్బీర్‌ సింగ్‌ రెజ్లర్‌ చెంప చెళ్లుమనిపించాడు. ఒక్కసారిగా రిఫరీ తనపై చేయి చేసుకోవడంతో సతేందర్‌ సహనం కోల్పోయి ఆ వెంటనే జగ్బీర్‌ సింగ్‌ను తిరిగి కొట్టాడు. మొత్తం ట్రయల్స్‌కే మచ్చ తెచ్చిన ఈ ఉదంతంపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కఠిన నిర్ణయం తీసుకుంది. రిఫరీపై ఎలాంటి చర్య తీసుకోకున్నా... క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ లేని సతేందర్‌పై జీవితకాల నిషేధం విధి స్తున్నామని ప్రకటించింది. ఈ  సంఘటన వీడియో పరిశీలిస్తే మాత్రం ముందుగా రిఫరీనే సతేందర్‌పై  చేయి చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 

అసలేం జరిగింది! 
ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో పోటీపడే రెజ్లర్ల కోసం ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. 125 కేజీల ఫైనల్‌ బౌట్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సతేందర్‌ మలిక్‌... మోహిత్‌తో తలపడి 3–0తో ముందంజలో నిలిచాడు. ఇంకో 18 సెకన్లలో బౌట్‌ ముగియనున్న దశలో మలిక్‌ను మోహిత్‌ మ్యాట్‌పై (టేక్‌డౌన్‌)పడగొట్టాడు. ఓ పట్టుపట్టి పక్కకు నెట్టేశాడు. బౌట్‌లో ఉన్న రిఫరీ వీరేందర్‌ మలిక్‌ ‘టేక్‌డౌన్‌’కు పాయింట్లు ఇవ్వకుండా... కేవలం నెట్టేసిన దానికి ఒక పాయింట్‌ ఇచ్చాడు. దీనిపై అసంతృప్తితో ఉన్న మోహిత్‌ ‘చాలెంజ్‌’కు వెళ్లాడు. ఈ అప్పీల్‌ను సీనియర్‌ రిఫరీ జగ్బీర్‌ సింగ్‌ టీవీ రిప్లేలో పరిశీలించారు. టేక్‌డౌన్‌ను పరిగణనలోకి తీసుకున్న జగ్బీర్‌ రెండు పాయింట్లు కేటాయించాడు. దీనివల్ల సతేందర్, మోహిత్‌ 3–3తో సమంగా నిలిచారు. రెజ్లింగ్‌ నిబంధనల ప్రకారం స్కోరు టై అయినపుడు ఆఖరి పాయింట్‌ ఎవరు చేస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు.

చివరి పాయింట్‌ మోహిత్‌ చేయడంతో అతన్నే విజేతగా ప్రకటించారు. అప్పీల్‌ (చాలెంజ్‌)తో తారుమారైన ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయిన సతేందర్‌ పక్కనే 57 కేజీల ఫైనల్‌ బౌట్‌ వేదికపై నుంచి నడుచుకుంటూ వెళ్లి రిఫరీ జగ్బీర్‌ నుంచి వివరణ కోరే ప్రయత్నం చేశాడు. అయితే జగ్బీర్‌ నుంచి సమాధానం బదులు సతేందర్‌ చెంపదెబ్బ తిన్నాడు. సతేందర్‌ కూడా క్షణికావేశానికి లోనై జగ్బీర్‌ను రెండు దెబ్బలేశాడు. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న డబ్ల్యూఎఫ్‌ఐ ఉన్నతాధికారులు, రెజ్లర్లు, పలువురు అభిమానులు ఖిన్నులయ్యారు. ఈ గందరగోళంలో రవి దహియా, అమన్‌ల మధ్య జరుగుతున్న 57 కేజీల ఫైనల్‌ బౌట్‌ను నిలిపి వేశారు. వీఐపీ వేదికపై డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ఈ బౌట్‌లను చూస్తున్నాడు. రెజ్లర్‌ అనుచిత ప్రవర్తనపై కన్నెర్ర చేసిన ఆయన ఇకపై బౌట్‌లో దిగకుండా కఠిన చర్య తీసుకున్నారు.   

చదవండి: ‘కామన్వెల్త్‌’కు వినేశ్ ఫొగాట్‌, సాక్షి మలిక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top