మహిళల వరల్డ్‌కప్‌: ఇంగ్లండ్‌కు షాక్‌.. ఫైనల్లో దక్షిణాఫ్రికా

Womens t20 World Cup: South Africa Beat England By 6 Runs - Sakshi

కేప్‌టౌన్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్లో ప్రవేశించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌పై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం కనబర్చిన దక్షిణాఫ్రికా తుదిపోరుకు అర్హత సాధించింది. తన 164 పరుగుల స్కోరును కాపాడుకుని విజయకేతనం ఎగురవేసింది. ఫలితంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగునున్న మెగా ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనుంది సౌతాఫ్రికా. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభమే లభించింది. ఐదు ఓవర్లు ముగిసేసరికే 53 పరుగులు చేసి శుభారంభం దక్కించుకుంది.

ఇంగ్లండ్‌ ఓపెనర్లు డానియెల్లీ వ్యాట్‌(34), సోఫియా(28)లు దూకుడైన ఆరంభాన్ని అందించారు. కాగా, ఆరు ఓవర్‌ తొలి బంతికి సోఫియా ఔటైన తర్వాత ఆపై బంతి వ్యవధిలో అలైస్‌ క్యాప్సే(0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. దాంతో ఇంగ్లండ్‌ 53 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అటు తర్వాత నాట్‌ స్కీవర్‌ బ్రంట్‌(40) ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. 34 బంతుల్లో ఐదు ఫోర్లు సాయంతో 40 పరుగులు చేసింది.కెప్టెన్ హీథర్‌ నైట్‌(31) ఫర్వాలేదనిపించింది. కాగా, అటు తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇంగ్లండ్‌ 6 పరుగులే చేసి పరాజయం పాలైంది. ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులే చేసి పరాజయం చవిచూసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయాబోంగా ఖోకా నాలుగు వికెట్లతో రాణించగా, షబ్నిమ్‌ ఇస్మాలి మూడు వికెట్లతో ఆకట్టుకుంది.

అంతకుముందు ముందుగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాప్రికా 165 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  ఓపెనర్లు వాల్వార్ద్‌త్‌(53),టాజ్మిన్‌ బిట్స్‌(68)లు హాఫ్‌ సెంచరీలతో మెరవడంతో పాటు  మారిజిమ్మే క్యాప్‌(27) అజేయంగా నిలవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top