గత పదేళ్లుగా టీమిండియా వన్డే, టీ20 జట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు హార్దిక్ పాండ్యా. అరుదైన పేస్ బౌలింగ్ నైపుణ్యాలున్న ఆల్‌రౌండర్‌గా పేరొందిన అతడి స్థానాన్ని భారత జట్టులో ఇంతవరకు ఎవరూ పూర్తిస్థాయిలో భర్తీ చేయలేకపోయారు.
ఇక ఫిట్‌నెస్ సమస్యల వల్ల 2018లో చివరి టెస్టు ఆడిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya).. గాయాలతో సావాసం చేస్తున్నా మొక్కవోని దీక్షతో వైట్‌బాల్ క్రికెట్‌లో మేటి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు.
వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీ ఆడతాడా?
ఇటీవల 2026 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన తర్వాత మరో పదేళ్లు ఆడతా.. పది ఐసీసీ ట్రోఫీలు సాధిస్తా అంటూ హార్దిక్ పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. అయితే, సుదీర్ఘ ప్రణాళిక, అంచనాలను పక్కనపెడితే.. అసలు వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీలోనే హార్దిక్ ఆడగలడా? లేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) హార్దిక్‌కు ఓ కండిషన్ పెట్టిందంటూ వచ్చిన వదంతులే ఇందుకు కారణం.
పది ఓవర్ల పాటు బౌలింగ్ చేసేలా
వన్డే మ్యాచ్‌లలో పూర్తి కోటా అంటే.. పది ఓవర్ల పాటు బౌలింగ్ చేసేలా సిద్ధం కావాల్సిందిగా బీసీసీఐ హార్దిక్ పాండ్యాను ఆదేశించినట్లు సమాచారం. కాగా 2019లో వెన్ను నొప్పికి సర్జరీ చేయించుకున్న తర్వాత అతడు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అతడికి సరైన రీప్లేస్‌మెంట్ లేదు కాబట్టి మేనేజ్‌మెంట్ సైతం మినహాయింపులు ఇస్తూ వస్తోంది.
కేవలం పద్దెనిమిది సార్లు మాత్రమే
నిజానికి హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు 88 వన్డేలు ఆడినప్పటికీ.. కేవలం పద్దెనిమిది సార్లు మాత్రమే పూర్తిగా పది ఓవర్లు బౌలింగ్ చేశాడు. 2019 తర్వాత ఎప్పుడూ కూడా కోటా పూర్తి చేసిన దాఖలాలు లేవు. అయితే, దేశవాళీ వన్డే టోర్నీలలో మాత్రం బరోడా తరఫున కొన్నిసార్లు పది ఓవర్లు వేశాడు.
సౌతాఫ్రికా పిచ్‌లకు అనుగుణంగా
ఇక సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్.. మహ్మద్ షమీతో కలిసి బౌలింగ్ విభాగంలో ఉన్న హార్దిక్‌కు పది ఓవర్లు వేసే అవసరం రాలేదు. టోర్నీ మధ్యలోనే అతడు చీలమండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. కాగా 2027లో సౌతాఫ్రికా-జింబాబ్వే- నమీబియా వన్డే వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యం ఇస్తున్నాయి.
సౌతాఫ్రికాలో ఎక్కువగా ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లు ఉన్న కారణంగా బీసీసీఐ హార్దిక్ పాండ్యాను ఎక్కువగా బౌలింగ్‌పై దృష్టి సారించాలని చెప్పినట్లు బోర్డు సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపాయి.
రేసులోకి నితీశ్ రెడ్డి!
పూర్తి కోటా కాకపోయినా కనీసం 6-7 ఓవర్లు అయినా వేసేలా సిద్ధం కావాలని చెప్పినట్లు పేర్కొన్నాయి. సీమ్ బౌలింగ్ ఆప్షన్‌గా అందుబాటులో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డి సైతం దేశీ క్రికెట్లో ఎక్కువగా బౌలింగ్ చేసిన విషయాన్ని సదరు వర్గాలు ఈ సందర్భంగా గుర్తుచేశాయి. కాగా బోర్డు ఆదేశాలకు హార్దిక్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. బౌలింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టేందుకు అతడు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
చదవండి: టీమిండియాకు శుభవార్త: నితీశ్ రెడ్డిపై గావస్కర్ ప్రశంసలు


