ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా విజయాల బాట పట్టి, అమాంతం ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. తాజాగా ఢిల్లీపై విజయానంతరం ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా మెరుగయ్యాయి. ప్రస్తుతం సీఎస్‌కే మెరుగైన రన్‌రేట్ కలిగి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరో 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ధీమాగా ఉంది. ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుంది.
అన్నీ సవ్యంగా సాగుతున్న తరుణంలో సీఎస్‌కే అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడు ధోనిని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. తలైవా ఇంకెప్పుడు బరిలోకి దిగుతాడంటూ గుసగుసలాడుకుంటున్నారు. అసలు వస్తాడా..? అని చర్చించుకుంటున్నారు. పరిస్థితిపై వాకబు చేస్తే వారనుకున్నదే నిజమయ్యేలా కనిపిస్తుంది.
సీఎస్‌కేలోని ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు, ధోనీ ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. అందుకే ఢిల్లీతో మ్యాచ్‌కు అతను జట్టుతో ప్రయాణించలేదు. ధోనీ స్వయంగా చెప్పిన మాట ప్రకారం.. పూర్తి ఫిట్‌నెస్ సాధించే వరకు బరిలోకి దిగడు. అనధికారికంగా ధోని మరో మాట కూడా చెప్పినట్లు తెలుస్తుంది. జట్టు మంచి లయలో ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టనని అన్నట్లు సమాచారం.
పైనున్న సమాచారం మేరకు.. ధోని ఈ సీజన్‌లో ఆడటం కష్టమే అని తేలిపోయింది. కేవలం జట్టులో స్పూర్తి నింపేందుకే అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. సీజన్ మొదలై ఐదు వారాలైనా రిటర్న్ డేట్‌పై ఎలాంటి క్లూ లేకపోవడం ధోని ఐపీఎల్ కెరీర్ ఎండింగ్‌పై కూడా సంకేతాన్ని ఇస్తుంది. ఒకవేళ ధోని ఇదే సీజన్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటే మాత్రం, ఈ సీజన్‌లోనే ఏదో ఒక మ్యాచ్‌లో అతన్ని చూడవచ్చు.


