
తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 248కే కూల్చేసిన భారత బౌలర్లు
తిప్పేసిన కుల్దీప్, జడేజా
ఫాలోఆన్‌లో విండీస్ ప్రతిఘటన
రెండో ఇన్నింగ్స్‌లో 173/2
కుల్దీప్, జడేజాలు తిప్పేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగుల్లోపే ఆలౌటైన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రతిఘటిస్తోంది. గత టెస్టులో వన్డే ఓవర్ల కోటా (50)ను ఆడలేకపోయిన కరీబియన్ బ్యాటర్లు ఆశ్చర్యకరంగా ఫిరోజ్‌షా కోట్లా స్పిన్ ట్రాక్‌పై పోరాటం కనబరుస్తున్నారు. దీంతో భారత జట్టు క్లీన్‌స్వీప్ ఆలస్యమవుతోంది. నాలుగో రోజుకు చేరిన ఈ టెస్టు ఫలితానికి భారత్ ఇంకా 8 వికెట్ల దూరంలో ఉండగా... ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి విండీస్ 97 పరుగులు చేయాల్సి ఉంది.
న్యూఢిల్లీ: పడేశారు... కానీ పడగొట్టాల్సిన పని ఇంకా మిగిలే ఉంది. భారత స్పిన్నర్లు ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్‌లో కూల్చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో కరీబియన్లు మన స్పిన్ ట్రాక్‌పై... మన స్పిన్నర్లకు సవాలు విసురుతున్నారు. దీంతో ఈ సిరీస్‌లో క్లీన్‌స్వీప్ విజయం కోసం నాలుగో రోజూ కూడా భారత బౌలర్లు శ్రమించాల్సిన అవసరం వచ్చింది.
మూడో రోజు ఆటలో కుల్దీప్ యాదవ్ 82 పరుగులిచ్చి 5 వికెట్లు, రవీంద్ర జడేజా 46 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. ఖరి పియర్ (23; 3 ఫోర్లు), ఫిలిప్ (24 నాటౌట్; 2 ఫోర్లు) కాసేపు ప్రతిఘటించారు.
అనంతరం ఫాలోఆన్ ఆడిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్ క్యాంప్‌బెల్ (87 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (66 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా రాణించారు. సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు.
కుల్దీప్ ఉచ్చులో పడి...
ఓవర్‌నైట్ స్కోరు 140/4తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్టిండీస్‌ను ఆరంభంలోనే కుల్దీప్ దెబ్బకొట్టాడు. ఓవర్‌నైట్ బ్యాటర్లు షై హోప్ (36; 5 ఫోర్లు), ఇమ్లాచ్ (21; 3 ఫోర్లు)లను తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. దీని నుంచి తేరుకోకముందే గ్రీవెస్ (17; 3 ఫోర్లు)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఆ మరుసటి ఓవర్లో సిరాజ్... వారికెన్ (1)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో 35 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లను కోల్పోయింది. అప్పుడు విండీస్ స్కోరు 175/8 కావడంతో ఇక లాంఛనమే మిగిలుందనిపించింది. కానీ పియర్, ఫిలిప్, సీల్స్ (13; 3 ఫోర్లు) దాదాపు 250 పరుగుల దాకా లాక్కొచ్చారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248 ఆలౌట్ (81.5 ఓవర్లలో); వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (బ్యాటింగ్) 87; తేజ్ చందర్‌పాల్ (సి) గిల్ (బి) సిరాజ్ 10; అతనేజ్ (బి) సుందర్ 7; షై హోప్ (బ్యాటింగ్) 66; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (49 ఓవర్లలో 2 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–17, 2–35. బౌలింగ్: సిరాజ్ 6–2–10–1, జడేజా 14–3–52–0, సుందర్ 13–3–44–1, కుల్దీప్ 11–0–53–0, బుమ్రా 4–2–9–0, జైస్వాల్ 1–0–3–0.