
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ ప్రత్యేకమైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరుగబోయే తొలి టెస్ట్‌లో విరాట్ మరో 21 పరుగులు చేస్తే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2000 పరుగుల మైలురాయిని తాకిన ఏడో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. బీజీటీలో విరాట్ 42 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో 1979 పరుగులు చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా..
1.సచిన్ టెండూల్కర్ - 3262 పరుగులు
2. రికీ పాంటింగ్ - 2555 పరుగులు
3. వీవీఎస్ లక్ష్మణ్ - 2434 పరుగులు
4. రాహుల్ ద్రావిడ్ - 2143 పరుగులు
5. మైఖేల్ క్లార్క్ - 2049 పరుగులు
6. చెతేశ్వర్ పుజారా - 2033 పరుగులు
7. విరాట్ కోహ్లీ - 1979 పరుగులు
కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1996-97 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు దిగ్గజాల పేరిట ఈ ట్రోఫీని నిర్వహిస్తారు. భారత్ 2013 నుంచి గత నాలుగు పర్యాయాలుగా ఇంటాబయటా ఈ ట్రోఫీకి గెలుచుకుంది.
స్వదేశంలో జరుగనున్న సిరీస్ కాబట్టి ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. భారత్ తాజాగా న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో సిరీస్ కోల్పోవడంలో సిరీస్ గెలవాలన్న ఆసీస్ ఆశలు రెట్టింపు అయ్యాయి.