
జైపూర్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కర్ణాటక, రాజస్తాన్ మధ్య జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ పోరులో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లు ఆడకుండానే 41.4 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. ఇక్కడ విశేషమేమిటంటే జట్టు మొత్తం కలిపి 199 పరుగులు చేస్తే అందులో కెప్టెన్ అయిన దీపక్ హుడా ఒక్కడే 109 పరుగులు బాదాడు.
దీన్ని బట్టే రాజస్తాన్ బ్యాటింగ్ వైఫల్యం ఏంటనేది స్పష్టంగా తెలుస్తోంది. దీపక్ హుడా తర్వాత సమర్పిత్ జోషి 33 పరుగులు చేశాడు. మిగతావారిలో ఏడుగురు బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కర్ణాటక బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, కృష్ణప్ప గౌతమ్ 2 వికెట్లు తీశారు. ఇక కర్ణాటక విజయలక్ష్యం 201 పరుగులు కాగా ప్రస్తుతం 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది.