వారెవ్వా వైశాలి | Vaishali wins the Womens Candidates Chess Tournament title | Sakshi
Sakshi News home page

వారెవ్వా వైశాలి

Apr 16 2026 3:47 AM | Updated on Apr 16 2026 3:47 AM

Vaishali wins the Womens Candidates Chess Tournament title

మహిళల క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ టైటిల్‌ సొంతం

ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసంజు వెన్‌జున్‌తో పోరు  

పాఫోస్‌ (సైప్రస్‌): ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి టైటిల్‌ దక్కించుకుంది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 14 రౌండ్ల తర్వాత తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల వైశాలి 8.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. క్యాండిడేట్స్‌ టోర్నీ విజేత హోదాలో వైశాలి ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం డిఫెండింగ్‌ చాంపియన్‌ జు వెన్‌జున్‌ (చైనా)తో తలపడుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ వేదికను, తేదీను ఇంకా ఖరారు చేయలేదు. 

ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ ఫార్మాట్‌లో జరిగిన క్యాండిడేట్స్‌ టోర్నీలో చివరిరోజు వైశాలి అద్భుతం చేసింది. గతంలో ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్‌)తో జరిగిన 14వ రౌండ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన వైశాలి 48 ఎత్తుల్లో గెలిచింది. తద్వారా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌కు అర్హత పొందింది. ఈ టోర్నీలో వైశాలి ఐదు గేముల్లో గెలిచి, ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. 

బిబిసారా అసయుబయేవా (కజకిస్తాన్‌; 8 పాయింట్లు) రన్నరప్‌గా నిలువగా... జు జినెర్‌ (చైనా; 7.5), అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా; 7.5 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌; 7 పాయింట్లు) ఐదో స్థానంలో, కాటరీనా లాగ్నో (6.5 పాయింట్లు) ఆరో స్థానంలో, దివ్య దేశ్‌ముఖ్‌ (భారత్‌; 5.5 పాయింట్లు) ఏడో స్థానంలో, టాన్‌ జోంగి (చైనా; 5.5 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచారు. విజేతగా నిలిచిన వైశాలికి 28,000 యూరోలు (రూ. 30 లక్షల 81 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. 

2011లో కోనేరు హంపి తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌కు అర్హత పొందిన రెండో భారతీయ చెస్‌ క్రీడాకారిణిగా వైశాలి గుర్తింపు పొందింది. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హు ఇఫాన్‌ (చైనా) చేతిలో హంపి ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 2018 మేలో కాటరీనా లాగ్నోపై గెలిచి తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన జు వెన్‌జున్‌ ఆ తర్వాత నాలుగుసార్లు (2018 నవంబర్‌; 2020, 2023, 2025) ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకుంది. 

మరోవైపు పురుషుల క్యాండిడేట్స్‌ టోర్నీలో ఉజ్బెకిస్తాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ జవోఖిర్‌ సిందరోవ్‌ 10 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది చివర్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ (భారత్‌)తో ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం సిందరోవ్‌ తలపడతాడు. వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద 6 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement