దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్లపై జాత్యహంకార ఆరోపణలు చేసిన మాజీ క్రికెటర్‌ 

Thami Tsolekile Makes Racism Allegations On South Africa Legendary Cricketers ABD And Greame Smith - Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా క్రికెట్‌లో జాతి వివక్ష కొత్తేమీ కాదు. ఇప్పటికే జాత్యాహంకారం కారణంగా ఆ దేశ క్రికెట్‌ జట్టు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ దేశ దిగ్గజ ఆటగాళ్లపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆ దేశ క్రికెట్లో సంచలనం రేపుతోంది. సఫారీ లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్, ఆ దేశ మాజీ కెప్టెన్‌ గ్రేమ్ స్మిత్‌లపై అదే దేశానికి చెందిన నల్లజాతి క్రికెటర్‌, వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మెన్‌ తమి సోలెకిలే జాత్యాంహంకార ఆరోపణలు చేశాడు. గతంలో (2011-2015) ఐదేళ్ల పాటు తాను నేషనల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సమయంలో నాటి కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌, ఏబీడీలు తనకు సరైన అవకాశాలు ఇవ్వకుండా తన ఎదుగుదలను అడ్డుకున్నారని, తనను జట్టులోకి తీసుకుంటే రిటైరవుతామని కూడా బెదిరించారని సోలికెలే ఆరోపించాడు. 

ఆ ఇద్దరు తనను తొక్కేశారని, అందువల్లే బ్యాకప్‌ ప్లేయర్‌గా మిగిలిపోయానని పేర్కొన్నాడు. 160 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తనకు, కేవలం మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కిందని వాపోయాడు. నాడు కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ లేకపోయి ఉంటే, తాను మరిన్ని మ్యాచ్‌లు ఆడేవాడినని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గ్రేమ్ స్మిత్‌కు నేను జట్టులో ఉండటం అస్సలు ఇష్టం లేదని జాతీయ సెలక్షన్ కన్వీనర్స్ ఆండ్రూ హడ్సన్, లిండా జోండిలతో కలిసి న్యాయస్థానం ముందు ఆరోపణలు చేశాడు. 

2013లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ సమయంలో రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ మార్క్ బౌచర్ కంటి గాయంతో బాధపడుతున్నాడని, తనకు తుది జట్టులో చోటు ఖాయమని సెలక్టర్ హడ్సన్ చెప్పాడని పేర్కొన్నాడు. అయితే, అప్పటివరకు ఎన్నడూ వికెట్ కీపింగ్ చేయని ఏబీ డివిల్లియర్స్, నాకు జట్టులో చోటు దక్కకూడదనే ఉద్దేశంతో వికెట్ కీపింగ్ చేయడానికి రెడీ అయ్యాడని ఆరోపించాడు. గ్రేమ్‌ స్మిత్‌, ఏబీడీలకు నల్ల జాతీయులతో కలిసి డ్రెసింగ్‌ రూమ్‌ షేర్‌ చేసుకోవడమన్నా, వారితో మాట్లాడటమన్నా అస్సలు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించాడు. నేను తన జట్టులో ఉండడం గ్రేమ్ స్మిత్‌కు ఇష్టం లేదని స్వయానా సెలక్టర్లే తనతో చెప్పినట్లు తెలిపాడు. కాగా, తమీ సోలెకిలే తన ఐదేళ్ల కాంట్రాక్ట్‌లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా సహా పలు విదేశీ టూర్లకు ఎంపికయ్యాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top