ఛేదిస్తారా.. సమర్పించుకుంటారా? 

Team India Trail By 309 Runs At Stumps Against Australia - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించాలంటే 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలి.  ఆదివారం నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఇంకా ఒకరోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. చివరిరోజు ఆటలో భారత్‌ విజయం సాధించాలంటే ఇంకా 309 పరుగులు సాధించాలి. మరి భారత్‌ లక్ష్యాన్ని ఛేదిస్తుందా.. లేక మ్యాచ్‌ను సమర్పించుకుంటుందా అనేది ఆసక్తికరం.   ఈ రోజు ఆటలో భాగంగా టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ ఘనంగా ఆరంభించింది. శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మలు భారత్‌కు మంచి ప్రారంభాన్ని  ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 71 పరుగులు సాధించిన తర్వాత గిల్‌(31; 64 బంతుల్లో 4 ఫోర్లు) ఔటయ్యాడు. (టీమిండియాకు క్రికెట్‌ ఆస్ట్రేలియా క్షమాపణలు)

ఆపై పుజారాతో జత కలిసిన రోహిత్ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 98 బంతుల్లో 1 సిక్స్‌, 5 ఫోర్లతో 52 పరుగులు చేసిన రోహిత్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కమిన్స్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతిని షాట్‌ ఆడి స్టార్క్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత పుజారా-రహానేలు ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను తీసుకున్నారు. ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండె వికెట్ల నష్టానికి 98 పరుగులు చేయగా, రహానే, పుజారాలు క్రీజ్‌లో ఉన్నారు. రేపు పిచ్‌ ఎలా అనుకూలిస్తుందో చూడాలి. అంతకముందు ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 312/6 వద్ద డిక్లేర్‌ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని 400లకు పైగా టార్గెట్‌ను టీమిండియా ముందుంచింది. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో లబూషేన్‌(73),  స్టీవ్‌ స్మిత్‌(81), కామెరూన్‌ గ్రీన్‌(84)లు రాణించడంతో పాటు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌(39 నాటౌట్‌) ఆకట్టుకోవడంతో ఆసీస్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top