SA vs IND: తడబడిన భారత బ్యాటర్లు... తొలి రోజు సఫారీలదే పైచేయి

Team India all out for 202 in the first innings, South Africa 167 runs behind - Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 202 ఆలౌట్‌

రాహుల్‌ అర్ధ సెంచరీ

దక్షిణాఫ్రికా 35/1

కఠినమైన పిచ్‌పై భారత జట్టు రోజంతా నిలవలేకపోయింది. సఫారీ బౌలర్లు పరిస్థితులను సమర్థంగా వాడుకొని టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. కేఎల్‌ రాహుల్, అశ్విన్‌ పట్టుదలగా ఆడినా ఇతర బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే ఆ తర్వాత మన బౌలర్లు కూడా ప్రభావం చూపడంతో 18 ఓవర్ల పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రెండో రోజూ ఇదే ఒత్తిడిని కొనసాగిస్తే భారత్‌ సాధించిన 202 పరుగులు కూడా విజయానికి బాటలు వేయవచ్చు. మూడేళ్ల క్రితం ఇదే మైదానంలో మొదటి ఇన్నింగ్స్‌లో 187 పరుగులు చేసి కూడా టీమిండియా గెలవగలగడం మానసికంగా ప్రేరణనిచ్చే అంశం!

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో సోమవారం మొదలైన రెండో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్‌ వైఫల్యంతో మన ఇన్నింగ్స్‌ 63.1 ఓవర్లకే ముగిసింది. తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (133 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... అశ్విన్‌ (50 బంతుల్లో 46; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్‌ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టపోయి 35 పరుగులు చేసింది. కీగన్‌ పీటర్సన్‌ (14 బ్యాటింగ్‌), డీన్‌ ఎల్గర్‌ (11 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 167 పరుగులు వెనుకబడి ఉంది.  

పుజారా, రహానే విఫలం...
ఆట తొలి గంటలో 36 పరుగులు చేసిన భారత్‌ బ్రేక్‌ ముగిసిన వెంటనే తొలి బంతికే మయాంక్‌ అగర్వాల్‌ (26) వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో 13 పరుగుల తర్వాత జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. ఫామ్‌లో లేని పుజారా (3), రహానే (0)లను ఒలీవియర్‌ వరుస బంతుల్లో పెవిలియన్‌ పంపించాడు. ఈ దశలో రాహుల్, విహారి (53 బంతుల్లో 20; 3 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడటంతో తొలి సెషన్‌ తర్వాత భారత్‌ స్కోరు 53/3 వద్ద నిలిచింది. అయితే లంచ్‌ తర్వాత 9 పరుగుల వద్ద బవుమా క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన విహారి దానిని ఉపయోగించుకోలేకపోయాడు.

రబడ బౌలింగ్‌లో అనూహ్యంగా లేచిన బంతిని విహారి ఆడబోగా, షార్ట్‌లెగ్‌లో వాన్‌ డర్‌ డసెన్‌ అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. అర్ధసెంచరీ సాధించిన వెంటనే రాహుల్‌ వెనుదిరగ్గా... పంత్‌ (17), శార్దుల్‌ (0) ప్రభావం చూపలేకపోయారు. అయితే అశ్విన్‌ పట్టుదలగా ఆడి జట్టు కుప్పకూలిపోకుండా కాపాడాడు. టీ విరామ సమయానికి 21 బంతులు ఆడిన అశ్విన్‌ 4 ఫోర్లతో 24 పరుగులు చేయడం విశేషం. మూడో సెషన్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ మరో 12.1 ఓవర్ల పాటు సాగింది. చూడచక్కటి షాట్లు ఆడిన అశ్విన్‌ అర్ధ సెంచరీ చేజార్చుకోగా, రబడ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టిన బుమ్రా (14 నాటౌట్‌) భారత్‌ స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఓపెనర్‌ మార్క్‌రమ్‌ (7)ను ఆరంభంలోనే అవుట్‌ చేసి షమీ దెబ్బ కొట్టగా... ఎల్గర్, పీటర్సన్‌ మరో వికెట్‌ పడకుండా రోజును ముగించారు. బుమ్రా బౌలింగ్‌లో 12 పరుగుల వద్ద పీటర్సన్‌ మొదటి స్లిప్‌లోకి సులువైన క్యాచ్‌ ఇవ్వగా... కీపర్‌ పంత్‌ అడ్డుగా వెళ్లి దానిని అందుకునే ప్రయత్నంలో వదిలేయడంతో సఫారీ టీమ్‌ ఊపిరి పీల్చుకుంది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) రబడ (బి) జాన్సెన్‌ 50; మయాంక్‌ (సి) వెరీన్‌ (బి) జాన్సెన్‌ 26; పుజారా (సి) బవుమా (బి) ఒలీవియర్‌ 3; రహానే (సి) పీటర్సన్‌ (బి) ఒలీవియర్‌ 0; విహారి (సి) డసెన్‌ (బి) రబడ 20; పంత్‌ (సి) వెరీన్‌ (బి) జాన్సెన్‌ 17; అశ్విన్‌ (సి) పీటర్సన్‌ (బి) జాన్సెన్‌ 46; శార్దుల్‌ (సి) పీటర్సన్‌ (బి) ఒలీవియర్‌ 0; షమీ (సి అండ్‌ బి) రబడ 9; బుమ్రా (నాటౌట్‌) 14; సిరాజ్‌ (సి) వెరీన్‌ (బి) రబడ 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (63.1 ఓవర్లలో ఆలౌట్‌) 202.  
వికెట్ల పతనం: 1–36, 2–49, 3–49, 4–91, 5– 116, 6–156, 7–157, 8–185, 9–187, 10–202.  
బౌలింగ్‌: రబడ 17.1–2–64–3, ఒలీవియర్‌ 17–1–64–3, ఎన్‌గిడి 11–4–26–0, జాన్సెన్‌ 17–5–31–4, కేశవ్‌ మహరాజ్‌ 1–0–6–0.  

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (బ్యాటింగ్‌) 11; మార్క్‌రమ్‌ (ఎల్బీ) (బి) షమీ 7; పీటర్సన్‌ (బ్యాటింగ్‌) 14; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 35.  
వికెట్ల పతనం: 1–14.
బౌలింగ్‌: బుమ్రా 8–3–14–0, షమీ 6–2–15–1, సిరాజ్‌ 3.5–2–4–0, శార్దుల్‌ 0.1–0–0–0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top