Ravindra Jadeja: జడేజా మోకాలి సర్జరీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Surgery Successful, Will Start Rehab Soon Says Ravindra Jadeja - Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మోకాలి సర్జరీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఆసియా కప్‌లో హాంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌ సందర్భంగా జడ్డూ కుడి మోకాలి గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం జడేజా గాయాన్ని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స అనివార్యమని సూచించారు. ఈ నేపథ్యంలో జడ్డూకు నిన్న సర్జజీ జరిగింది. శస్త్ర చికిత్స సక్సెస్‌ అయినట్లు జడేజానే స్వయంగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. 

సర్జరీ చేయించుకునే క్రమంలో తనకు చాలామంది మద్దతుగా నిలిచారని.. బీసీసీఐ, సహచరులు, సపోర్ట్‌ స్టాఫ్‌, ఫిజయోలు, డాక్టర్లు మరి ముఖ్యంగా అభిమానులు నా వెన్నంటే నిలిచారని జడ్డూ తెలిపాడు. త్వరలోనే కోలుకునే ప్రక్రియ మొదలుపెడతానని, సాధ్యమైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అంటూ సర్జరీ తర్వాతి ఫోటోను షేర్‌ చేస్తూ కామెంట్స్‌ జోడించాడు. 

కాగా, గత కొంతకాలంగా జడేజా గాయాలతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాతి నుంచి జడ్డూ ఆడిన ప్రతి సిరీస్‌లోనూ ఏదో ఒక గాయం బారిన పడుతూ వస్తున్నాడు. గాయం కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి కూడా అర్ధంతరంగా వైదొలిగాడు. తాజాగా ఆసియా కప్‌లో కీలక దశ మ్యాచ్‌లకు ముందు గాయం తిరగబెట్టడంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఈ ప్రభావం టీమిం‍డియాపై భారీగా చూపింది. సరైన బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ లేక టీమిండియా ఆసియా కప్‌ బరిలో నుంచి దాదాపుగా వైదొలిగింది. 

పాకిస్తాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో కాని, తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కాని జడేజా ఉండి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని భారత అభిమానులు భావిస్తున్నారు. అంతకుముందు గ్రూప్‌ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతర్వాత హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ అన్ని విభాగాల్లో పర్వాలేదనిపించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. గాయంతో జడేజా జట్టు నుంచి వైదొలగడంతో సూపర్‌-4 దశలో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో జడ్డూ టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సమయానికైనా కోలుకుని జట్టులో చేరాలని టీమిండియా అభిమానాలు ఆకాంక్షిస్తున్నారు.    
చదవండి: ఆసియాకప్‌లో విరాట్‌ కోహ్లి చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top