ఐపీఎల్‌లో రెండో టైటిల్ కోసం ‘ఆరెంజ్ ఆర్మీ’ రెడీ
ఇషాన్ కిషన్ సారథ్యంలో బరిలోకి
అభిషేక్ శర్మ, హెడ్‌పై భారీ ఆశలు
కమిన్స్ గైర్హాజరీలో బౌలింగ్ దళం బలహీనం
ఒకప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే... బలమైన బౌలింగ్ దళానికి చిరునామాగా నిలిచేది! ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాలను నిర్దేశించినా... పకడ్బందీ బౌలింగ్‌తో వాటిని కాపాడుకుంటూ సత్తా చాటేది! కానీ 2024 సీజన్ నుంచి జట్టు దృక్పథం పూర్తిగా మారిపోయింది. గత రెండేళ్లుగా రైజర్స్ ‘తూ మార్... మై మార్’ ప్లాన్‌తో దుమ్మురేపుతోంది. ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లలో తొలి నాలుగింటిని ఈ రెండు సీజన్‌లలోనే తమ పేరిట లిఖించుకుందంటే రైజర్స్ ఊచకోత ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, లివింగ్‌స్టోన్, నితీశ్ కుమార్ రెడ్డి ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం హిట్టర్‌లతో నిండి ఉంది. ఆరంభ మ్యాచ్‌లకు కమిన్స్ లేకపోవడంతో బౌలింగ్ మరింత బలహీనపడగా... ఈ సీజన్‌లో ఇషాన్ కిషన్ జట్టును ఎలా నడిపిస్తాడనేది వేచి చూడాలి. –సాక్షి క్రీడా విభాగం
విజృంభణ, విధ్వంసం, ఊచకోత... ఇవి గత రెండేళ్లుగా సన్‌రైజర్స్ బ్యాటింగ్ సాగిన తీరుకు పర్యాయపదాలు. ఒరిలోకి దిగింది మొదలు... చివరి బంతి వరకు ఒకటే బాదుడు! ‘యాభై పరుగులకే ఆరు వికెట్లు పడ్డా... ఏడో బ్యాటర్ కూడా ధాటిగా ఆడే క్రమంలోనే వెనుదిరగాలి తప్ప... డిఫెన్స్ ఆడుతూ దొరికిపోకూడదు’ అనే కమిన్స్ మంత్రాన్ని పాటిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈ రెండేళ్లలో లెక్కకు మిక్కిలి రికార్డులు తిరగరాసింది.
అయితే బ్యాటింగ్‌లో దూకుడు ఉన్నా... బౌలింగ్‌లో నాణ్యత లేక రైజర్స్ వెనుకబడి పోయింది. 2013లో లీగ్‌లోకి అడుగుపెట్టిన సన్‌రైజర్స్... 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో తొలిసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మరో రెండుసార్లు (2018, 2024లో) ఫైనల్‌కు చేరినా... రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
ఇప్పటికే బలహీనంగా ఉన్న సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం... రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్‌గైర్హాజరీతో మరింత డీలా పడింది. గత ఏడాది లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 6వ స్థానంలో నిలిచిన రైజర్స్... ఈసారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
బ్యాటింగ్‌పైనే భారం...
ఐపీఎల్‌లోని అన్ని జట్లలో విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు ఏదంటే సన్‌రైజర్స్ అనే చెప్పాలి. ఓపెనింగ్ నుంచి ఎనిమిదో స్థానం వరకు దూకుడుగా బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు రైజర్స్ టీమ్‌కు సొంతం. క్షణాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోవడంలో ఓపెనర్లు అభిషేక్, హెడ్ సిద్ధహస్తులు. ఇషాన్ ధాటి ఏపాటిదో ఇటీవల టి20 ప్రపంచకప్‌లో అందరూ చూశారు.
తాత్కాలిక సారథిగానూ అతడిపై అదనపు బాధ్యతలు ఉన్నాయి. క్లాసెన్, లివింగ్‌స్టోన్, నితీశ్ కుమార్ రెడ్డితో మిడిలార్డర్ దుర్బేధ్యంగా ఉంది. ఈ బ్యాటింగ్ లైనప్ కలిసికట్టుగా కదంతొక్కితే... ఎలాంటి బౌలింగ్ అయినా కకావికలం కావాల్సిందే. ఇప్పటికే హిట్టర్లతో దట్టంగా ఉన్న రైజర్స్... ఈ ఏడాది మినీ వేలంలో రూ. 13 కోట్లు పెట్టి ఇంగ్లండ్ ప్లేయర్ లివింగ్‌స్టోన్‌ను తీసుకుంది.
కమిన్స్ లేకపోవడంతో అతడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో మరింత ప్రభావం చూపాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
స్ట్రయిక్ బౌలర్ లోటు!
మంచినీళ్ల ప్రాయంలా భారీ స్కోర్లు చేస్తున్నా... రైజర్స్ నిలకడగా విజయాలు సాధించలేకపోవడానికి కారణం బలహీన బౌలింగ్. జట్టుకు అవసరమైనప్పుడు వికెట్ తీసే స్ట్రయిక్ బౌలర్ లేకపోవడం అతిపెద్ద ప్రతికూలాంశం. ఉన్న ఒక్క టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీని సైతం జట్టు వదిలేసుకుంది. దీంతో జైదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్‌లపై అదనపు భారం పడనుంది.
ఆరంభ మ్యాచ్‌ల్లో విదేశీ ప్లేయర్‌ల కోటాలో హెడ్, క్లాసెన్, లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్ చోటు దక్కించుకోవచ్చు. ఒక్క పేరున్న స్పిన్నర్ కూడా జట్టులో లేడు. ప్రఫుల్, అమిత్, ఓంకార్, సాకిబ్ హుస్సేన్, శివాంగ్‌ను వేలంలో తీసుకున్నా వారికి మ్యాచ్ దక్కే అవకాశాలు తక్కువే. సలీల్ అరోరా, శివమ్ మావి ఏమాత్రం ఆకట్టుకుంటారో చూడాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా, క్లాసెన్, హెడ్, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్‡్ష దూబే, కార్స్, శివాంగ్, క్రెయిన్స్ ఫులెట్రా, లివింగ్‌స్టోన్, డేవిడ్ పైన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, కమిన్స్, జీషాన్ అన్సారీ, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్, అమిత్, ప్రఫుల్, శివమ్ మావి.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ గణాంకాలు
ఆడిన మ్యాచ్‌లు 196
గెలిచినవి 94
ఓడినవి 101
రద్దు 1
అత్యుత్తమ ప్రదర్శన
విజేత (2016), రన్నరప్ (2018, 2024)


