
కౌలాలంపూర్: భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ నాలుగేళ్ల తర్వాత టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 21–18, 24–22తో ప్రపంచ 23వ ర్యాంకర్ యుషి తనాకా (జపాన్)పై తుదికంటా పోరాడి గెలిచాడు. ప్రతీ గేమ్‌లోనూ జపనీస్ ప్రత్యర్థి నుంచి కఠినమైన సవాళ్లు ఎదురైనా... ఏ దశలోనూ పట్టుసడలించని భారత స్టార్ వరుస గేముల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. ‘చాలా అనందంగా ఉంది. గతేడాది ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. ఈ ఫలితం కోసం ఎంతగానో శ్రమించాను’ అని శ్రీకాంత్ అన్నాడు.
32 ఏళ్ల ఈ షట్లర్ చివరిసారిగా 2021లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరి రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీల విషయానికొస్తే అతను ఆరేళ్ల తర్వాత టైటిల్ పోరుకు అర్హత సాధించినట్లయింది. 2019లో జరిగిన ఇండియా ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ వెటరన్ స్టార్ రన్నరప్‌గా నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ చైనాకు చెందిన రెండో సీడ్ లీ షి ఫెంగ్‌తో తలపడతాడు.