IPL 2023: చేతికి 5 కుట్లు.. అయినా 15 ఓవర్ల మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకం

Sanjay Bangar Recalls Kohli 100 With Stitches In 2016 IPL VS PBKS - Sakshi

Virat Kohli: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో విరాట్‌ కోహ్లి జర్నీ 15 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఐపీఎల్‌ అధికారిక బ్రాడ్‌కాస్టింగ్‌ పార్ట్‌నర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోహ్లితో అనుబంధం ఉన్న పలువురు మాజీ క్రికెటర్లను ఓ గొడుగు కిందకు చేర్చిన స్టార్‌ స్పోర్ట్స్‌.. కోహ్లితో వారికున్న అనుభవాలను రివీల్‌ చేయించింది.

ఈ సందర్భంగా భారత మాజీ ఆల్‌రౌండర్‌ సంజయ్‌ బాంగర్‌ను పలకరించిన స్టార్‌స్పోర్ట్స్‌.. కోహ్లితో ఉన్న అనుభవాలను రివీల్‌ చేయాలని కోరగా, ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 2016 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి చేతికి కుట్లు పడినా, ఆ బాధను దిగమింగుతూ విధ్వంసకర శతకం బాదిన వైనాన్ని బాంగర్‌ గుర్తు చేసుకున్నాడు. కోహ్లి పట్టుదల, అతనికి ఆట పట్ల ఉన్న అంకితభావం ఎలాంటివో తెలియజేయడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని బాంగర్‌ తెలిపాడు.

వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. విరాట్‌ కోహ్లి (50 బంతుల్లో 113; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కోహ్లికు జతగా క్రిస్‌ గేల్‌ (32 బంతుల్లో 73; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) కూడా వీరవిహారం చేశాడు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్‌.. 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసి 82 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌) ఓటమిపాలైంది.

కాగా, ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 81.08 సగటున రికార్డు స్థాయిలో 973 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఐపీఎల్‌లో ఇదే అత్యధిక సీజన్‌ స్కోర్‌ (ఓ సీజన్‌లో ఓ ఆటగాడు సాధించిన అత్యధిక పరుగులు). 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top