'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నాకు నచ్చదు.. అందుకు నేను బిగ్ ఫ్యాన్ కాదు'.. ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే యాదృచ్చికంగా అదే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఢిల్లీకి తొలి విజయాన్ని అందించింది.
ఐపీఎల్-19వ సీజన్‌లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అయితే ఈ విజయంలో యువ ఆటగాడు సమీర్ రిజ్వీది కీలక పాత్ర. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

సమీర్ సంచలనం..
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో కేవలం 141 పరుగులకే కుప్పకూలింది. లుంగీ ఎంగిడీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, టి. నటరాజన్ తమ బౌలింగ్‌తో లక్నో పతనాన్ని శాసించారు. అయితే 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ సులువుగా సాధిస్తుందని అంతా భావించారు. కానీ లక్నో తరపున అరంగేట్రం చేసిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ.. ఢిల్లీ ఇన్నింగ్స్ మొదటి బంతికే కేఎల్ రాహుల్‌ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు.
ఆ తర్వాత దాదాపు 15 నెలల తర్వాత బరిలోకి దిగిన మొహ్సిన్ ఖాన్.. తన మొదటి ఓవర్‌లోనే నితీష్ రాణాను ఔట్ చేసి ఢిల్లీని బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. ఆ ఓవర్‌లో కనీసం ఒక్క పరుగు కూడా అతడు ఇవ్వలేదు. అనంతరం యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో ఒకే ఓవర్‌లో పాతుమ్ నిస్సంకను, అక్షర్ పటేల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఢిల్లీ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో ఢిల్లీ మేనెజ్‌మెంట్ సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపింది. వాస్తవానికి ఆరంభంలో వికెట్లు పడకపోయింటే గత సీజన్‌లో రాణించిన అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేవాడు. కానీ త్వరగా వికెట్లు పడిపోవడంతో రిజ్వీని ఇంపాక్ట్ సబ్‌గా పంపాల్సి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన రిజ్వీ.. లక్నో పేసర్లను ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించాడు. అతడు తను ఎదుర్కొన్న తొలి 13 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపి ఢిల్లీ తప్పు చేసిందా? అన్న భావన అందరిలోనూ కలిగింది. కానీ ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఆఖరి బంతికి నోకియా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన సమీర్ రిజ్వీ.. ఆ తర్వాత మరి ఆగలేదు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి స్కోర్ బోర్డులో వేగం పెంచాడు. స్పిన్నర్లను ఓ ఆట ఆడుకున్నాడు.
షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో 3 ఫోర్లు బాదిన సమీర్ రిజ్వీ.. ఐడైన్ మార్క్‌రమ్ బౌలింగ్‌లో 6,4 బాది 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి అజేయంగా 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొన్న రిజ్వీ.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో ఎవరీ సమీర్ రిజ్వీ అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.

ఎవరీ సమీర్ రిజ్వీ?
ఐపీఎల్-2024 మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీని రూ. 8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఒక అన్-క్యాప్డ్ ప్లేయర్ కోసం సీఎస్‌కే ఇంత భారీ మొత్తం వెచ్చించడం అప్పటిలో సంచలనంగా మారింది. ఐపీఎల్‌లో తను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన రిజ్వీ.. తర్వాత తన జోరును కొనసాగించలేకపోయాడు. ఆ ఏడాది 8 మ్యాచ్‌లు ఆడిన రిజ్వీ కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు సీఎస్‌కే అతడిని విడిచిపెట్టింది. ఈ మెగా వేలంలో రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ. 95 లక్షలకే సొంతం చేసుకుంది. గత సీజన్‌లో అతడు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం 121 పరుగులు చేశాడు. అయినప్పటికి అతడిపై నమ్మకం ఉంచిన ఢిల్లీ యాజమాన్యం తిరిగి రిటైన్ చేసుకుంది. ఇప్పుడు మేనెజ్‌మెంట్ నమ్మకాన్ని రిజ్వీ నిలబెట్టుకున్నాడు.
22 ఏళ్ల సమీర్ రిజ్వీ ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. యూపీ టీ20 లీగ్ అరంగేట్ర సీజన్(2024)లో రిజ్వీ దుమ్ములేపాడు. కాన్పూర్ సూపర్‌స్టార్స్ తరపున ఆడిన రిజ్వీ.. కేవలం 49 బంతుల్లోనే 104 అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే అతడిని సీఎస్‌కే అంత భారీ ధరకు సొంతం చేసుకుంది. అతడిని అందరూ "రైట్ హ్యాండెడ్ సురేష్ రైనా" అని పిలుస్తారు.
రైనా లాగే మిడిల్ ఓవర్లలో వచ్చి వేగంగా పరుగులు రాబట్టడం, భారీ షాట్లు ఆడడం సమీర్ స్పెషాలిటీ. రైనా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఒక స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో రిజ్వీ కూడా నడుస్తున్నాడు. సమీర్ రిజ్వీ ఫస్ట్ క్రికెట్‌లో యూపీ తరపున ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడాడు. కానీ రెడ్‌బాల్ క్రికెట్‌లో అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ లిస్ట్-ఎ, టీ20 క్రికెట్‌లో మాత్రం తన హవాను కొనసాగిస్తున్నాడు.
చదవండి: KKR vs SRH: సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?


