Wriddhiman Saha: సాహా ట్వీట్‌.. వాట్సాప్‌ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లు.. రంగంలోకి బీసీసీఐ..! ‘అతడు కాంట్రాక్ట్‌ ప్లేయర్‌..’

Saha Row: BCCI To Investigate Wriddhiman Saha Threat Episode - Sakshi

Wriddhiman Saha: టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా వ్యవహారం భారత క్రికెట్‌ వర్గాల్లో సంచలనం రేపుతోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాని నేపథ్యంలో.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై సాహా పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను రిటైర్‌ అవ్వాలంటూ ద్రవిడ్‌ సలహా ఇచ్చాడని పేర్కొన్నాడు. అంతేకాదు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తనకు జట్టులో చోటు ఉంటుందని హామీ ఇచ్చాడనడం అనుమానాలకు తావిస్తోంది.

బోర్డు నిబంధనలకు విరుద్ధంగా గంగూలీ సెలక్షన్‌ కమిటీ సమావేశాలకు హాజరవుతున్నారని అప్పట్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో సాహా వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. అసలు భారత క్రికెట్‌లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇదిలా ఉంటే... రాహుల్‌ ద్రవిడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం సహా... ఓ జర్నలిస్టు తనను ఉద్దేశించి బెదిరింపు ధోరణిలో మెసేజ్‌లు పంపాడంటూ సాహా ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘భారత క్రికెట్‌కు ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన తర్వాత.. సోకాల్డ్‌ ఓ జర్నలిస్టు నా పట్ల ప్రదర్శించిన ‘గౌరవం’ఇది! జర్నలిజం ఎలా మారిపోయిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ సదరు వ్యక్తి తనకు పంపిన వాట్సాప్‌ మెసేజ్‌లు సాహా షేర్‌ చేశాడు. 

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి సహా... వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌ తదితరులు అతడికి అండగా నిలిచాడు. ఒక క్రికెటర్‌ పట్ల సదరు జర్నలిస్టు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని, అతడి పేరు బయటపెట్టాల్సిందిగా వృద్ధికి సూచించారు. ఇక ఈ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి జోక్యం చేసుకోవాలని రవిశాస్త్రి విజ్ఞప్తి చేశాడు.

ఈ పరిణామాల క్రమంలో సాహా వివాదంపై దృష్టి సారించిన బీసీసీఐ... ఈ అంశంపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. సాహాకు మెసేజ్‌లు చేసిన వ్యక్తి ఎవరు? ఇంటర్వ్యూలో అతడు ఏం మాట్లాడాడు? తదితర విషయాల గురించి లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ‘‘బీసీసీఐ కాంట్రాక్ట్‌ ప్లేయర్‌ సాహా. అతడి పట్ల ఎవరైనా అవమానకరంగా వ్యవహరిస్తే బోర్డు చూస్తూ ఊరుకోదు.

బెదిరింపులకు పాల్పడితే అస్సలు సహించదు. కచ్చితంగా విచారణ ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రీడా విశ్లేషకులు..... ‘‘గంగూలీకి సాహాతో మాట్లాడి హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సాహా కూడా ఇలా మాట్లాడం సరికాదు. అసలేం జరిగిందో అర్థం కావడం లేదు’’ అని అంటున్నారు.

ఆ స్క్రీన్‌షాట్‌లో ఏముందంటే!
‘‘నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. బాగుంటుంది. మీరు సరిగా స్పందించకపోతే.. నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహించను. ఎవరు అత్యుత్తమ వికెట్‌ కీపరో... వాళ్లు అతడినే ఎంపిక చేస్తారు కదా. నువ్వు నాకు కాల్‌ చేయలేదు. నిన్నెపుడూ ఇక ఇంటర్వ్యూ చేయను. ఈ అవమానాన్ని నేను అంత తేలికగా మర్చిపోను. కచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. నువ్విలా చేయకుండా ఉండాల్సింది’’అంటూ సదరు జర్నలిస్టు తనకు వాట్సాప్‌లో మెసేజ్‌ చేశాడంటూ సాహా స్క్రీన్‌షాట్లు షేర్‌ చేశాడు.

చదవండి: Rahul Dravid-Wriddhiman Saha: సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్‌... అతడంటే నాకు గౌరవం ఉంది.. కానీ కాస్త..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top