Wisden Cricketers Of The Year: ప్రతిష్టాత్మక అవార్డుకు రోహిత్‌, బుమ్రా ఎంపిక.. కోహ్లికి దక్కని చోటు

Rohit Sharma, Jasprit Bumrah Among Wisden 5 Cricketers Of The Year - Sakshi

లండన్‌: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, భారత పేసు గుర్రం జస్ప్రీత్‌  బుమ్రాలకు అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరు మరో ముగ్గురితో కలిసి ప్రతిష్టాత్మక విజ్డన్ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021 అవార్డుకు ఎంపికయ్యారు. విజ్డన్ టాప్ 5 క్రికెటర్స్ జాబితాలో రోహిత్‌, బుమ్రాలతో పాటు గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన డేవాన్ కాన్వే (న్యూజిలాండ్‌), ఓలీ రాబిన్సన్ (ఇంగ్లండ్‌), డాన్ వాన్ నికెర్క్ (దక్షిణాఫ్రికా మహిళా జట్టు సారధి) చోటు దక్కించుకున్నారు. లీడింగ్‌ క్రికెటర్‌ ఇన్‌ ద వరల్డ్‌ 2022 ఎడిషన్‌ అవార్డును ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ ఎగురేసుకుపోయాడు. ఈ వివరాలను విజ్డన్ ఎడిటర్ లారెన్స్ బ్రూత్ వెల్లడించారు.

2021లో ఏకంగా 6 సెంచరీలు (1708 పరుగులు) సాధించినందుకు గాను రూట్‌ను, ఇంగ్లండ్ గడ్డపై (టెస్ట్ సిరీస్‌) సత్తా చాటినందుకు గాను రోహిత్ శర్మ, బుమ్రాలను ఆయా అవార్డులకు ఎంపిక చేసినట్లు బ్రూత్‌ పేర్కొన్నాడు. గతేడాది సమ్మర్‌లో ఇంగ్లండ్ గడ్డపై భారత్ రెండు టెస్ట్‌లు గెలవడంలో రోహిత్ శర్మ, బుమ్రా కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో వర్షం అంతరాయం కలిగించకుంటే టీమిండియా సునాయసంగా విజయం సాధించి సిరీస్‌ గెలిచేదని ప్రస్తావించాడు. 

ఇంగ్లండ్‌ పర్యటనలో బుమ్రా 4 టెస్ట్‌ల్లో 18 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడని గుర్తు చేశాడు. ఆ సిరీస్‌ భారత్ సాధించిన రెండు విజయాల్లో రోహిత్‌ది ముఖ్యపాత్ర అని, లార్డ్స్‌ టెస్ట్‌లో అతని ప్రదర్శన అద్భుతంగా ఉందని కితాబునిచ్చాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రోహిత్‌ 4 టెస్ట్‌ల్లో 368 పరుగులు చేసి టీమిండియా బ్యాటింగ్‌ వెన్నెముకగా నిలిచాడని పేర్కొన్నాడు. కాగా, 5 టెస్ట్‌ల ఇంగ్లండ్‌ పర్యటనలో భారత్‌ 2-1 ఆధిక్యంలో ఉండగా, కోవిడ్‌ కారణంగా చివరి టెస్ట్‌ రద్దైంది.  
చదవండి: ఫ్రీగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసారం.. స్టార్ స్పోర్ట్స్‌ లింకును దొంగిలించి..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top