తెల్లవారుజామున ఇంటి డోర్‌ కొట్టి క్షమాపణ చెప్పాడు

Rishabh Pant Childhood Coach Recalls He Knocked On My Door For Apologise - Sakshi

ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ దూకుడుకు మారుపేరు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బాదుడే లక్ష్యంగా పెట్టుకునే పంత్‌ ఇటీవల జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయాడు. ధోని స్థానాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధమవుతున్న పంత్‌ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తాడు. ఇటీవలే దానికి సంబంధించిన వీడియోలు రిలీజ్‌ చేశాడు. ఇదిలా ఉండగా.. పంత్‌ తాను ఏదైనా తప్పు చేస్తే అది సరిదిద్దుకునేవరకు అతను నిద్రపోడని పంత్‌ చిన్ననాటి కోచ్‌ తారక్‌ సిన్హా పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌ సమయంలో పంత్‌ తప్పు చేస్తే తాను తిట్టానని.. తెల్లవారుజామున నా ఇంటి తలుపులు కొట్టి నాకు క్షమాపణ చెప్పాడంటూ తారక్‌ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాజాగా తారక్‌  ఒక ఇంటర్య్వూలో గుర్తుచేసుకున్నాడు.

విషయంలోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లో పుట్టి పెరిగిన పంత్‌ క్రికెట్‌ను మాత్రం ఢిల్లీలోని ఐకానిక్‌ క్లబ్‌ ఆఫ్‌ సొన్నెట్‌లో నేర్చుకున్నాడు. తన చిన్నతనంలో ఎక్కువ శాతం ప్రాక్టీస్‌ను ఇక్కడే చేశాడు. ఆ సమయంలో తారక్‌ సిన్హా ఆ క్రికెట్‌ క్లబ్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ఒకరోజు ప్రాక్టీస్‌ సమయంలో నెట్‌ సెషన్‌లో పంత్‌ ప్రవర్తనపై కోపం వచ్చి  అతన్ని తిట్టి అక్కడినుంచి వెళ్లిపోయాడు. కాగా తారక్‌ వైశాలి ప్రాంతంలో ఉంటున్నారు. పంత్‌ ఉంటున్న ప్రాంతానికి చాలా దూరంలో ఉంటుంది. కోచ్‌ను అప్‌సెట్‌ చేసినందుకు ఫీలైన పంత్‌ ఆరోజు నిద్రపోలేదు. మరుసటిరోజు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కారులో వైశాలిలోని తారక్‌ ఇంటికి వెళ్లాడు. వారి ఇంటి డోర్‌ కొట్టి అతనికి తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పాడు. దీంతో తారక్‌ పంత్‌ను లోపలికి తీసుకెళ్లి.. ''ఈ విషయం  రేపు పొద్దున మాట్లాడేవాళ్లం కదా.. అయిన తప్పు నాది కూడా ఉంది.. నీతో అంత హార్ష్‌గా వ్యవరించాల్సింది కాదు.'' అని సిన్హా పంత్‌కు తెలిపాడు. 


ఇక 2017లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన పంత్‌ క్రమంగా జట్టులో సుస్థిర స్థానం సంపాదిస్తున్నాడు. గతేడాది ఆసీస్‌లో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో నాలుగో టెస్టులో పంత్‌ ఆడిన నాకౌట్‌ ఇన్నింగ్స్‌(89 నాటౌట్‌)ఎప్పటికి గుర్తుండిపోతుంది.ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ పంత్‌ నిలకడగా రాణించాడు. ఓవరాల్‌గా టీమిండియా తరపున పంత్‌ 20 టెస్టుల్లో 1358 పరుగులు, 18 వన్డేల్లో 529 పరుగులు, 33 టీ20ల్లో 512 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్‌ జట్టును విజయవంతంగా నడిపించాడు. కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
చదవండి: టీమిండియాలో అత్యంత ప్రమాదకర‌ ఆటగాడు అతనే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top