రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ ఓపెనర్ జేకబ్ బెతెల్ బంగారు గొలుసు నేల మీద పడిపోయింది. అయితే, అతడు దానిని తీసుకోవడం మర్చిపోయి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఐపీఎల్-2026లో భాగంగా ఆర్సీబీ- కేకేఆర్ బుధవారం రాయ్‌పూర్ వేదికగా తలపడ్డ సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆర్సీబీ.. కేకేఆర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఆరు వికెట్ల తేడాతో గెలుపు
అంగ్‌క్రిష్ రఘువంశీ (71), కామెరాన్ గ్రీన్ (32), రింకూ సింగ్ (49 నాటౌట్) రాణించారు. ఫలితంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జేకబ్ బెతెల్ కేవలం 15 పరుగులు చేసి.. కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో అవుటయ్యాడు.
అయితే, మరో ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయం సెంచరీ (105)తో మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (39) రాణించాడు. ఈ క్రమంలో 19.1 ఓవర్లలో ఆర్సీబీ నాలుగు వికెట్లు నష్టపోయి టార్గెట్ పూర్తి చేసింది. తద్వారా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
కిందపడిన బంగారు గొలుసు
ఇదిలా ఉంటే.. కార్తిక్ త్యాగి సంధించిన బౌన్సర్ జేకబ్ బెతెల్ హెల్మెట్‌కు బలంగా తాకింది. ఈ క్రమంలోనే అతడి మెడలో ఉన్న గోల్డ్ చెయిన్ కింద పడిపోయింది. అయితే, అవుటై పెవిలియన్‌కు వెళ్లిపోతున్న క్రమంలో బెతెల్.. బంగారు గొలుసు తీసుకోవడం మర్చిపోయాడు. అతడి స్థానంలో వచ్చిన పడిక్కల్.. ఈ విషయాన్ని గుర్తించాడు.

PC: X
అదే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇలా జరిగి ఉంటే..
మైదానంలో పడిన బంగారు గొలుసు తీసి అంపైర్‌కు చూపించగా.. అది అక్కడి నుంచి బెతెల్‌కు చేరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు పేలుస్తున్నారు.
‘‘అసలే బంగారం ధర రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో గొలుసు దొరికితే ఎవరూ వదిలిపెట్టరు. ఇది ఐపీఎల్‌లో జరిగింది కాబట్టి సరిపోయింది. బెతెల్‌కు తన గొలుసు లభించింది. అదే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇలా జరిగి ఉంటే.. గొలుసు మళ్లీ కనిపించేదే కాదు’’ అని వ్యంగ్యరీతిలో కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: సీఎస్‌కేకు భారీ షాక్!.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్


