సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్‌లో బెంగళూరు టోర్పిడోస్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో బెంగళూరు టోర్పిడోస్ 15–13, 16–4, 15–13తో ముంబై మిటియోస్ జట్టును ఓడించింది. అమెరికాకు చెందిన మ్యాట్ వెస్ట్ సారథ్యంలోని బెంగళూరు జట్టు ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై జట్టు ఫైనల్లో తేలిపోయింది.
మరో అమెరికా ప్లేయర్ జెలెన్ పెన్‌రోజ్, భారత్‌కు చెందిన సేతు, జోయల్ బెంజమిన్, జిష్ణు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగళూరుకు తొలిసారి పీవీఎల్ టైటిల్‌ను అందించారు. ముంబై తరఫున కెప్టెన్ అమిత్ గులియా, ఓం లాడ్ వసంత్, శుభమ్ ఆకట్టుకున్నారు. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 40 లక్షలు... రన్నరప్ ముంబై జట్టుకు రూ. 30 లక్షలు ప్రైజ్‌మనీ లభించింది.
పీవీఎల్ ‘బెస్ట్ బ్లాకర్’గా ప్రిన్స్ మలిక్ (గోవా గార్డియన్స్)... ‘బెస్ట్ అటాకర్’గా జోయల్ బెంజమిన్ (బెంగళూరు)... ‘బెస్ట్ సర్వర్’గా సేతు (బెంగళూరు)... ‘బెస్ట్ సెట్టర్’గా వసంత్ (ముంబై)... ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా మథియాస్ లాఫ్టెస్‌నెస్ (ముంబై)... ‘బెస్ట్ లిబెరో’గా ప్రభాకరన్ (అహ్మదాబాద్ డిఫెండర్స్)... ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా జోయల్ బెంజమిన్ పురస్కారాలు గెల్చుకున్నారు.


