సింగపూర్: ఏడాదిన్నర కాలంగా టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు కేవలం 37 నిమిషాల్లో 21–9, 21–12తో రికో గుంజీ (జపాన్)పై అలవోకగా గెలిచింది. అయితే నేడు సింధు సత్తాకు అసలు పరీక్ష ఎదురుకానుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడనుంది.
ఆన్ సె యంగ్‌తో ఇప్పటి వరకు ఆడిన 8 సార్లూ సింధు ఓడిపోవడం గమనార్హం. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం... మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సాతి్వక్–చిరాగ్ 21–15, 11–21, 21–18తో లీ జె హుయె–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ)లపై... తనీషా–ధ్రువ్ 8–21, 21–17, 21–16తో యుటా వతనాబె–మాయా టగుచి (జపాన్)లపై నెగ్గారు.
పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ చేరుకోగా... భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ నిష్క్రమించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తొలి గేమ్‌లో లక్ష్య సేన్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో కున్లావుత్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యెవ్ (సింగపూర్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 21–16, 15–21తో ఓడిపోయాడు.


