IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌ తో గుజరాత్‌ టైటాన్స్‌ ఢీ.. బెయిర్‌స్టో ఎంట్రీ!

Punjab Kings vs Gujarat Titans Match Prediction - Sakshi

ఐపీఎల్‌-2022లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి.  బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ శుక్రవారం సాయంత్రం7: 30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ టైటాన్స్‌ ఈ మ్యాచ్‌లో కూడా విజయ ఢాంకా మోగించాలని భావిస్తోంది. మరో వైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించిన పంజాబ్‌ కింగ్స్‌ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఇక జట్టు బలాబలాలు గురించి మాట్లాడుకుంటే.. ఇరు జట్లు బ్యాటింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తోన్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌ విషయానికి వస్తే.. ఓపెనర్‌ శుభమాన్‌ గిల్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

అదే విధంగా మరో ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ కూడా తనదైన రోజున బ్యాట్‌ ఝుళిపించగలడు. అదే విధంగా మిడిలార్డర్‌లో హార్ధిక్‌ పాండ్యా, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లతో గుజరాత్‌ దృఢంగా ఉంది. ఇక బౌలింగ్‌లో కూడా  రషీద్ ఖాన్, లూకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ వంటి స్టార్‌ బౌలర్లతో గుజరాత్‌ బలంగా ఉంది. పంజాబ్‌ కింగ్స్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌స్టో ఆడే అవకాశం ఉంది.

ఒక వేళ అతడికి తుది జట్టులో చోటు దక్కితే.. రాజపక్స బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇక శిఖర్ ధావన్, లివింగ్‌‌స్టోన్, మయాంక్ అగర్వాల్ వంటి స్టార్‌ ఆటగాళ్లతో పంజాబ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కన్పిస్తోంది. ఇక సీఎస్కేపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన లివింగ్‌‌స్టోన్ మరోసారి తన మార్క్‌ను చూపించాలని పంజాబ్‌ ఆశిస్తోంది. ఇక బౌలింగ్‌ విభాగంలో కూడా  కగిసో రబాడ,రాహుల్ చాహర్, అర్షదీప్‌ సింగ్‌ లాంటి బౌలర్లతో పంజాబ్‌ స్ట్రాంగ్‌ గా కనిపిస్తోంది. 

తుది జట్లు (అంచనా)

పంజాబ్‌ కింగ్స్‌: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లివింగ్‌‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), షారూక్ ఖాన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), కగిసో రబాడ, ఓడెన్ స్మిత్, వైభవ్ అరోరా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్

గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వెడ్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, అభినవ్ మనోహర్, వరుణ్ అరోన్, లూకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top