ఆమె అసలు ఓనర్‌లా ఉండదు.. ఓడినా కూడా.. | Sakshi
Sakshi News home page

ఆమె అసలు ఓనర్‌లా ఉండదు.. ఓడినా కూడా..

Published Sat, Apr 27 2024 5:46 PM

శశాంక్‌ సింగ్‌- అశుతోశ్‌ శర్మతో ప్రీతి జింటా

‘‘ఆమె ఒక అద్భుతమైన మహిళ. జట్టుతో మమేకమై పోతుంది. టీమ్‌ ఓడిపోయినపుడు నిరాశకు గురైనా.. తన భావోద్వేగాలను నియంత్రించుకోగల శక్తి ఆమెకు ఉంది. ఆమె గొప్ప నటి. ఎంతో అనుభవం ఉన్న, విజయవంతమైన ఆర్టిస్ట్‌.

ప్రతి సినిమా హిట్‌ కాదనే విషయం ఆమెకు తెలుసు. అలాగే.. ప్రతి మ్యాచ్‌లోనూ గెలవలేమనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. మ్యాచ్‌లో ఓటమిపాలైన తర్వాత మాతో మాట్లాడుతున్నపుడు చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుంది. నేను ఆ జట్టుకు మూడేళ్ల పాటు ఆడాను. నలభై కంటే ఎక్కువ మ్యాచ్‌లలో భాగమయ్యాను.

అయినా.. ఓడిన సందర్భాల్లో కేవలం రెండు- మూడుసార్లు మాత్రమే ఆమె మా మీద కోపం చూపించింది. మిగతా సందర్బాల్లో అసలు ఏమీ అనలేదు’’ అని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌, పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఇర్ఫాన్‌ పఠాన్‌ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.

పంజాబ్‌ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌ అంటే ఆమెకు ఎంతో ఇష్టమని.. ఓటమిపాలైనప్పుడు కూడా జట్టుకు ఆమె మద్దతుగానే ఉంటుందని ఇర్ఫాన్‌ పఠాన్‌ చెప్పుకొచ్చాడు.

తన చేత్తో పరాఠాలు చేసి పెట్టింది
అదే విధంగా కీలక మ్యాచ్‌లో గెలిస్తే గనుక ప్రీతి సంతోషానికి అవధులు ఉండవని.. అలాంటి సమయంలో తానే స్వయంగా వంట చేసి అందరికీ వడ్డిస్తుందని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాలో తాము చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించినపుడు ప్రీతి జింటా స్వయంగా తన చేత్తో 40 పరాఠాలు చేసి తమకు అందించిందని ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు.

ఫ్రాంఛైజీ జట్ల యజమానుల్లో ప్రీతి జింటా వేరే లెవల్‌ అంటూ ప్రశంసించాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్‌ విధించిన 261 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి చరిత్ర సృష్టించింది.

దుమ్ములేపిన బెయిర్‌స్టో, శశాంక్‌
జానీ బెయిర్‌స్టో విధ్వంసకర శతకానికి తోడు శశాంక్‌ సింగ్‌ కూడా దంచి కొట్టడంతో ఎనిమిది వికెట్ల తేడాతో కేకేఆర్‌ను చిత్తు చేసింది. దీంతో పంజాబ్‌ కింగ్స్‌ శిబిరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా గురించి గుర్తు చేసుకుంటూ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

చదవండి:  రోహిత్‌, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే: యువీ

IFrame

Advertisement
Advertisement