
ప్రాంజల ఖాతాలో ఐటీఎఫ్ టోర్నీ డబుల్స్ టైటిల్
గురుగ్రామ్: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ యడ్లపల్లి ప్రాంజల ఏడేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్‌లో డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ముగిసిన ఐటీఎఫ్ డబ్ల్యూ–15 మహిళల టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌కే చెందిన చిలకలపూడి శ్రావ్య శివానితో కలిసి ప్రాంజల డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ప్రాంజల–శివాని జోడీ 6–4, 6–0తో భారత్‌కే చెందిన మహిక ఖన్నా–సోహిని మొహంతి ద్వయంపై గెలుపొందింది.
63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల–శ్రావ్య శివాని ద్వయం ప్రత్యర్థి జంట సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ప్రాంజల కెరీర్‌లో ఇది ఏడో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 2018లో చివరిసారి ఆమె రుతుజా భోసలేతో కలిసి థాయ్‌లాండ్‌లో రెండు డబుల్స్ టైటిల్స్ సాధించింది. 2017లో నాలుగు డబుల్స్ టైటిల్స్ నెగ్గింది. సింగిల్స్ విషయానికొస్తే ప్రాంజల నాలుగు టైటిల్స్ నెగ్గగా... 2021లో చివరిసారి బెంగళూరు ఓపెన్‌లో విజేతగా నిలిచింది.
ఆ తర్వాత గాయాల బారిన పడటంతో ప్రాంజల కెరీర్ తడబడింది. మరోవైపు శ్రావ్య శివాని కెరీర్‌లో ఇది మూడో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 25 ఏళ్ల శ్రావ్య శివాని 2021లో షర్మదా బాలుతో కలిసి మొనాస్టిర్ ఓపెన్ టోర్నీలో, 2022లో సిలైన్ సిమున్యు (ఐర్లాండ్)తో కలిసి నైరోబి ఓపెన్ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచింది.