'వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు భయపడాల్సిందే'

Paul Collingwood England Will Feared By Lot Of Teams Next T20 World Cup - Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు.. అసిస్టెంట్‌ కోచ్‌ పాల్‌ కొలింగ్‌వుడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉన్న ఇంగ్లండ్‌ జట్టు అద్భుతంగా ఆడుతుందని.. రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను చూసి ప్రత్యర్థులు భయపడే అవకాశముందని తెలిపాడు. 2010లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సాధించిన ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా కొలింగ్‌వుడ్‌ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా.. ఇరు జట్లు 2-2తో సమానంగా ఉన్నాయి. కాగా నేడు కీలకమైన ఐదో టీ20 జరగనుంది.  ఈ నేపథ్యంలో కొలింగ్‌వుడ్‌ స్పందించాడు.

'గత నాలుగేళ్లుగా చూసుకుంటే పొట్టి ఫార్మాట్‌లో మా జట్టు ప్రదర్శన అద్బుతంగా సాగుతుంది. ఇప్పుడు జట్టులో ఒకటి నుంచి మొదలుకొని 11వ స్థానం వరకు మ్యాచ్ విన్నర్లు ఉండడం విశేషం. 2010 సమయంలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచినప్పటికి.. ఇప్పటి జట్టుతో పోలిస్తే మేము అంత బలంగా లేము. కానీ అప్పట్లో జట్టు సమిష్టి ప్రదర్శనతో కప్‌ సాధించాం. ఆ తర్వాత మా జట్టు ప్రదర్శన దిగజారింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి... జట్టులో ఒకరిని మించి ఒకరు మ్యాచ్‌ విన్నర్లు ఉండడం కలిసొచ్చే అంశం. ఇప్పుడు టీ20ల్లో ఇంగ్లండ్‌ జట్టు నెంబర్‌వన్‌ స్థానంలో ఉండడం..  రానున్న టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు భయం కలిగించే అంశంగా చెప్పవచ్చు. తాజాగా టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను కోల్పోయినా.. పొట్టి ఫార్మాట్‌కు వచ్చేసరికి మాత్రం నెంబర్‌వన్‌ జట్టు ఆటతీరు ఎలా ఉంటుందనేది ఇంగ్లండ్‌ చూపించింది. సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలవడంతో ఆఖరి టీ20  కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌ గెలిచి టెస్టు సిరీస్‌ ఓటమికి బదులు తీర్చుకుంటాం'అని చెప్పుకొచ్చాడు.

కాగా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందిన పాల్‌ కొలింగ్‌వుడ్‌ ఇంగ్లండ్‌  తరపున 68 టెస్టుల్లో 4,259 పరుగులు.. 17 వికెట్లు, 197 వన్డేల్లో 5078 పరుగులు.. 117 వికెట్లు, 36 టీ20ల్లో 583 పరుగులు సాధించాడు. 2007-08 మధ్య కాలంలో ఇంగ్లండ్‌ వన్డే జట్టుకు కెప్టెన్‌గా సేవలందించిన కొలింగ్‌వుడ్‌ 2010లో టీ20 కెప్టెన్‌గా వ్యవహరించి.. ఆ జట్టు ఒక మేజర్‌ టోర్నీ(ఐసీసీ 2010 టీ20 ప్రపంచకప్‌)ని కొల్లగొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత్‌ వేదికగా అక్టోబర్లో జరగనుంది.‌‌ 
చదవండి:
నా లిస్ట్‌లో సూర్య పేరు కచ్చితంగా ఉంటుంది: యువీ
అదొక చెత్త నిర్ణయం: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top