న్యూజిలాండ్‌ ప్లేయర్‌ ప్రపంచ రికార్డు | NZ vs SA 2nd ODI: Amelia Kerr Creates History World Record | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ ప్లేయర్‌.. వరల్డ్‌ రికార్డు

Apr 2 2026 4:01 PM | Updated on Apr 2 2026 4:28 PM

NZ vs SA 2nd ODI: Amelia Kerr Creates History World Record

PC: WHITE FERNS X

న్యూజిలాండ్‌ క్రికెటర్‌ అమేలియా కెర్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌- ఓపెనర్‌ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. కాగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో స్వదేశంలో న్యూజిలాండ్‌ వైట్‌బాల్‌ సిరీస్‌లు ఆడుతోంది.

ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ జరుగగా ఆతిథ్య న్యూజిలాండ్‌ 4-1 తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవగా.. వెల్లింగ్‌టన్‌ వేదికగా బుధవారం రెండో వన్డే జరిగింది.

346 పరుగులు
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. కెప్టెన్‌ వాల్వర్ట్‌ (69; 8 ఫోర్లు, 1 సిక్స్‌), అనికె బాష్‌ (91; 12 ఫోర్లు), ట్రియాన్‌ (25 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు. 

అనంతరం ఛేదనలో న్యూజిలాండ్‌ 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసి.. రెండు వికెట్ల తేడాతో గెలిచింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.

139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగా
గతేడాది ఆస్ట్రేలియాపై టీమిండియా ఛేజ్‌ చేసిన 339 పరుగుల స్కోరు రెండో స్థానానికి చేరింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కివీస్‌ సారథి అమేలియా కెర్‌ (Amelia Kerr) ఆకాశమే హద్దుగా చెలరేగింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేసిన ఆమె మొత్తంగా 139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగా నిలిచింది.

కెర్‌ ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, 1 సిక్స్‌ ఉండటం విశేషం. ఇలా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో కెర్‌ న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చగా... ఆమెకు ఇసాబెల్లా (68;11 ఫోర్లు) చక్కటి సహకారం అందించింది. సఫారీ బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా... ప్రస్తుతం సిరీస్‌ 1–1తో సమమైంది.

అమేలియా కెర్‌ ప్రపంచ రికార్డు
సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా అమేలియా కెర్‌ 179 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా.. మహిళల వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌- ఓపెనింగ్‌ ప్లేయర్‌గా రికార్డు సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం చమరి ఆటపట్టు పేరిట ఉండేది.

బ్రిస్టల్‌ వేదికగా 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆటపట్టు 178 పరుగులతో అజేయంగా నిలిచింది. తాజాగా ఆమె కంటే ఒక్క పరుగు ఎక్కువ చేసిన అమేలియా కెర్‌.. ఆటపట్టును అధిగమించింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (171), న్యూజిలాండ్‌ స్టార్లు సుజీ బేట్స్‌ (168), బీఎమ్‌ హైల్డే (157) కెర్‌, ఆటపట్టు తర్వాతి స్థానాల్లో నిలిచారు.

చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్‌ సూర్యవంశీపై పాక్‌ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement