బంగ్లాదేశ్‌ పర్యటన.. కివీస్‌ వన్డే, టీ20 జట్ల ప్రకటన | New Zealand Announces ODI And T20I Teams For Bangladesh Tour 2026, Check Out Squad Names And Other Details Inside | Sakshi
Sakshi News home page

BAN vs NZ: బంగ్లాదేశ్‌ పర్యటన.. కివీస్‌ వన్డే, టీ20 జట్ల ప్రకటన

Mar 31 2026 6:30 PM | Updated on Mar 31 2026 6:51 PM

New Zealand Announces ODI T20I teams For Bangladesh Tour 2026

బంగ్లాదేశ్‌ పర్యటనకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టును కివీస్‌ బోర్డు ప్రకటించింది. ఇందులో పేస్‌ త్రయం మ్యాట్‌ ఫిషర్‌, విలియం ఓ రూర్కీ, బ్లెయిర్‌ టిక్నర్‌లకు చోటు దక్కింది. కాగా భారత్‌తో టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ ముగిసిన వెంటనే దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడింది కివీస్‌ జట్టు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రొటిస్‌ జట్టు ఆతిథ్య న్యూజిలాండ్‌పై 3-2తో గెలిచింది.

పరిమిత ఓవర్ల సిరీస్‌లు
ఇక ఈ సిరీస్‌ తర్వాత న్యూజిలాండ్‌ బంగ్లాదేశ్‌ పర్యటన (New Zealand tour of Bangladesh, 2026)కు వెళ్లేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత ఏప్రిల్‌ 17న వన్డే సిరీస్‌ మొదలుకానుండగా.. మే 2 నాటి మూడో టీ20తో ఈ టూర్‌ ముగియనుంది.

టామ్‌ లాథమ్‌ సారథ్యంలో
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కివీస్‌ బోర్డు తాజాగా తమ జట్లను ప్రకటించింది. మిచెల్‌ సాంట్నర్‌ (Mitchell Santner) స్థానంలో వన్డే, టీ20 జట్లకు టెస్టు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ సారథ్యం వహించనున్నాడు.

కాగా సాంట్నర్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడితో పాటు పలువురు కీలక ప్లేయర్లు సైతం ఐపీఎల్‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ విధులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్లేయర్లతో కివీస్‌ బోర్డు వన్డే, టీ20 జట్లను ప్రకటించింది.

ఇక గాయాల నుంచి కోలుకున్న ఫిషర్‌, ఓరూర్కీ, టిక్నర్‌ తిరిగి జట్టుతో చేరడం పట్ల హెడ్‌కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. ఆఫ్‌ స్పిన్నింగ్‌ ఆల్‌రౌండర్‌ డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ చాలా కాలం తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.

బంగ్లాదేశ్‌ పర్యటనకు న్యూజిలాండ్ వన్డే జట్టు (ఏప్రిల్‌ 17, 20, 23)
టామ్‌ లాథమ్‌ (కెప్టెన్‌), ముహమ్మద్‌ అబ్బాస్‌, ఆదిత్య అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌, జోష్‌ క్లార్క్‌సన్‌, డేన్‌ క్లీవర్‌, డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌, నిక్‌ కెల్లి, జేడెన్‌ లెనాక్స్‌, హెన్రీ నికోల్స్‌, విలియం ఓరూర్కీ, బెన్‌ సియర్స్‌, నాథన్‌ స్మిత్‌, బ్లెయిర్‌ టిక్నర్‌, విల్‌ యంగ్‌.

బంగ్లాదేశ్‌తో టీ20లకు న్యూజిలాండ్‌ జట్టు (ఏప్రిల్‌ 27, 29, మే 2)
టామ్‌ లాథమ్‌ (కెప్టెన్‌), కెటెనె క్లార్క్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌, జోష్‌ క్లార్క్‌సన్‌, డేన్‌ క్లీవర్‌, మ్యాట్‌ ఫిషర్‌, డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌, బెవాన్‌ జేకబ్స్‌, నిక్‌ కెల్లి, జేడెన్‌ లెనాక్స్‌, టిమ్‌ రాబిన్సన్‌, బెన్‌ సియర్స్‌, నాథన్‌ స్మిత్‌, ఇష్‌ సోధి, బ్లెయిర్‌ టిక్నర్‌.

చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు వైభవ్‌ సూర్యవంశీని పంపండి: మైకేల్‌ వాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement