హైదరాబాద్: ఆర్‌ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ తుది పోరులో ముంబై మీటియర్స్, బెంగళూరు టార్పెడోస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ బ్లాక్‌బస్టర్ పోరుకు ముందు, ఇరు జట్ల కెప్టెన్లు, కోచ్‌లు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని, గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఫైనల్ పట్ల ఉత్కంఠ, పరస్పర గౌరవం, గెలవాలన్న బలమైన సంకల్పం వాళ్ళ మాటల్లో స్పష్టంగా కనిపించాయి. లీగ్ దశలో ముంబై మీటియర్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి, 17 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరు జట్టు క్రమశిక్షణ కలిగిన జట్టు అని, దాన్ని ఓడించాలంటే కేవలం తప్పులు చేయకుండా ఉంటే సరిపోదని, అంతకుమించి ఆడాలని ముంబై హెడ్ కోచ్ మాట్ వాన్ వెజెల్ పేర్కొన్నాడు.
ప్రతి బంతిని జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంలా ఆడటం తమ జట్టు మానసిక బలమని అన్నాడు. కెప్టెన్ అమిత్ గులియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, గడిచిన పాయింట్ల గురించి కాకుండా రాబోయే పాయింట్‌పైనే దృష్టి సారిస్తామని, జట్టు సమష్టి కృషితో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.
మరోవైపు, బెంగళూరు టార్పెడోస్ సైతం బలమైన ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి, 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ముంబై లీగ్‌లోనే అత్యంత నిలకడైన జట్టు అని బెంగళూరు హెడ్ కోచ్ డేవిడ్ లీ ప్రశంసించాడు.
అయితే, ఫైనల్ ఫలితం ప్రత్యర్థి ఆటకంటే, తమ సొంత ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుందని, సర్వ్ అండ్ పాస్ గేమ్‌లో దూకుడుగా ఆడతామని స్పష్టం చేశాడు. ముంబైకి ఇది తొలి ఫైనల్ కాగా, 2023లో తన జట్టును ఫైనల్‌కు నడిపిన అనుభవం లీకి ఉంది.
ఈసారి టైటిల్ గెలవడం ద్వారా ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఫైనల్‌లో కీలక ఆటగాళ్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. టార్పెడోస్ తరఫున అటాకర్ జోయెల్ బెంజమిన్ 103 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా ఉండగా, ముంబైకి చెందిన శుభమ్ చౌదరి (102) అతని వెనుకే ఉన్నాడు.
అయితే, బెంగళూరు అటాకర్లకు ముంబై బ్లాకర్లు పీటర్ ఓస్ట్విక్, శుభమ్ చౌదరి నుంకి గట్టి సవాలు ఎదురుకానుంది. ఈ ఈద్దరూ లీగ్‌లోని టాప్-5 బ్లాకర్లలో ఉన్నారు. అదే సమయంలో, బెంగళూరు సర్వర్ సేతు (11 సర్వ్ పాయింట్లు) ముంబైకి అతిపెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.
బెంగళూరు కెప్టెన్ మాట్ వెస్ట్ మాట్లాడుతూ, "మీరు ఎక్కడ ఉన్నారన్నది కాదు, మీరెలా ఆడతారన్నదే ముఖ్యం. మీ ఆటతీరు మార్చుకోవద్దు" అని సహచరులకు సలహా ఇచ్చాడు. ఫైనల్ ఆడే అరుదైన అవకాశాన్ని ఆస్వాదించాలని పిలుపునిచ్చాడు.
ఫైనల్లో ఇరు జట్లు భారతీయ వాలీబాల్‌లోని అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తాయని ఆశిస్తున్నట్లు రెండు జట్ల కోచ్ లు, కెప్టెన్లు ఆశాభావం వ్యక్తం చేశారు. "పీవీఎల్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలుస్తుంది" అని ముంబై కెప్టెన్ గులియా ముగించాడు.


