ధోని రిటైర్మెంట్‌.. ఐదేళ్ల క్రితం ప్ర‌క‌ట‌న వైర‌ల్‌! | MS Dhoni To-Retire In-Chennai 5-Year-Old Declaration Became Viral | Sakshi
Sakshi News home page

ధోని రిటైర్మెంట్‌.. ఐదేళ్ల క్రితం ప్ర‌క‌ట‌న వైర‌ల్‌!

May 18 2026 6:21 PM | Updated on May 18 2026 7:18 PM

MS Dhoni To-Retire In-Chennai 5-Year-Old Declaration Became Viral

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ (సీఎస్‌కే)కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్ల‌తో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్‌తో పోటీ ప‌డుతున్న సీఎస్‌కే త‌న చివ‌రి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 16 పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే అవ‌కాశ‌ముంది. 

మ‌రోవైపు సీఎస్కేకు ఐదు టైటిల్స్ అందించిన‌ ఎంఎస్ ధోని మాత్రం ఈ సీజ‌న్‌లో పిక్క కండ‌రాల గాయంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం సీఎస్‌కే త‌మ సొంత హోంగ్రౌండ్‌లో ఎస్ఆర్‌హెచ్‌తో సీజ‌న్‌లో చివ‌రి మ్యాచ్ ఆడ‌నుంది. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ‌స్తున్న వేళ సీఎస్‌కే అభిమానులు అత‌డిని చివ‌రిసారిగా మైదానంలో చూడాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. 

అయితే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాడా? లేదా అన్న‌ది ప‌క్క‌న‌బెడితే ఐదేళ్ల క్రితం ధోని త‌న రిటైర్మెంట్‌పై చేసిన ప్ర‌క‌ట‌న తాజాగా వైర‌ల్‌గా మారింది. 2021లో చాంపియ‌న్‌గా నిలిచిన సీఎస్‌కే టైటిల్ వేడుక సందర్భంగా అప్ప‌టి కెప్టెన్ హోదాలో ధోనీ మాట్లాడాడు. త‌న చివ‌రి టీ20 మ్యాచ్‌ను చెన్నైలో ఆడాల‌ని ఆశిస్తున్న‌ట్లు ధోనీ తెలిపాడు. 

'నేను నా క్రికెట్‌ను ఎప్పుడూ ప్ర‌ణాళికబ‌ద్దంగానే ఆడాను. నా కెరీర్‌లో చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్‌ను సొంతఊరు రాంచీలో ఆడడం ఎన్న‌టికీ మ‌రిచిపోను. ఇక నాకు రెండో హోంగ్రౌండ్ అయిన చెన్నై స్టేడియంలో సీఎస్‌కే త‌ర‌ఫున చివ‌రి టీ20 మ్యాచ్ ఆడుతాన‌ని ఆశిస్తున్నా. అది వ‌చ్చే ఏడాదో లేక ఐదేళ్ల‌లోనా అనేది క‌చ్చితంగా తెలియ‌దు' అని ధోనీ ఐదేళ్ల క్రితం త‌న రిటైర్మెంట్ గురించి ముందే సూచించాడు. 

చెన్నై వేదిక‌గా త‌ల‌ప‌డ‌నున్న‌ సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో ధోని ఆడితే గ‌నుక అత‌ని ఐదేళ్ల ప్ర‌క‌ట‌న ఇవాళ నిజ‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. సీఎస్‌కేతో త‌న సుదీర్ఘ ప్ర‌యాణం కూడా ముగియ‌నుంది. మ‌రి ధోనీ ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ఆడుతాడా లేదా అన్న‌ది మ‌రో రెండు గంటల్లో తేలిపోనుంది.

ఇదే మంచి త‌రుణం: అశ్విన్‌
ధోనీకి అనుచ‌ర గ‌ణంలో ఒకడిగా గుర్తింపు పొందిన భార‌త మాజీ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. పిక్క కండ‌రాల గాయం నుంచి కోలుకున్న ధోనీ సీఎస్‌కే త‌ర‌ఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ని తెలిపాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడేందుకు ఇదే మంచి అవకాశ‌మ‌ని నాకు అనిపిస్తోంది. అది ఎలా జరుగుతుందో వేచి చూడాలి. 

నేను విన్నంత వరకు, అతను గత రెండు మూడు మ్యాచ్‌లుగా మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. 44 ఏళ్ల ధోని సీఎస్‌కే జ‌ట్టుకు దూరంగా ఉండ‌డం వెనుక ఒక ప్ర‌ణాళిక దాగుంది. ఈ సీజ‌న్‌లో ధోనీ లేకుండానే సీఎస్‌కే త‌మ ప్ర‌యాణాన్ని కొన‌సాగించింది. 

ఇప్ప‌టికీ ప్లేఆఫ్స్ రేసులో స్థిరంగా కొన‌సాగుతున్న సీఎస్‌కే తుది జ‌ట్టులో మార్పులు చేయ‌డం క‌ష్ట‌త‌ర‌మే. అయితే ధోనికి ఇది చివరి మ్యాచ్ అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో ఎస్ఆర్‌హెచ్‌తో పోరులో ధోనీ ఫ్యాన్స్ అత‌డిని చివ‌రిసారి చూసే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

చదవండి: బంగ్లా బ్యాట‌ర్ చ‌రిత్ర‌.. పాక్‌కు క్లీన్‌స్వీప్‌ గండం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement