ఆసియా తొలి ప్లేయర్‌గా రికార్డు.. చరిత్ర పుటల్లోకి అతడి పేరు! | Mehidy Hasan Becomes 1st Asian Player To Achieve Huge Feat In Tests | Sakshi
Sakshi News home page

ఆసియా తొలి ప్లేయర్‌గా రికార్డు.. చరిత్ర పుటల్లోకి అతడి పేరు!

May 1 2025 12:14 PM | Updated on May 1 2025 1:56 PM

Mehidy Hasan Becomes 1st Asian Player To Achieve Huge Feat In Tests

బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ (Mehidy Hasan Miraz) చరిత్రపుటల్లోకెక్కాడు. ఆసియాలో ఇంత వరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో ఒకే రోజు శతకం బాదడంతో పాటు ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

జింబాబ్వేతో రెండో టెస్టు సందర్భంగా మెహదీ హసన్‌ మిరాజ్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. కాగా రెండు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్‌ పర్యటన (Zimbabwe tour of Bangladesh)కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది.

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో
అయితే, చట్టోగ్రామ్‌ వేదికగా రెండో టెస్టు (Ban vs Zim 2nd Test)లో మాత్రం ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 106 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. 

ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ 1–1తో సమంగా ముగిసింది. ఆల్‌రౌండర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ (162 బంతులలో 104; 11 ఫోర్లు, 1 సిక్స్‌; 5/32) బ్యాటింగ్‌లో సెంచరీ బాదడంతో పాటు... జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మెహదీ హసన్‌ దూకుడు
గత టెస్టులో బంగ్లాదేశ్‌ను ఓడించి నాలుగేళ్ల తర్వాత ఈ ఫార్మాట్‌లో తొలి విజయం ఖాతాలో వేసుకున్న జింబాబ్వే దాన్ని కొనసాగించడంలో విఫలమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 291/7తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌... చివరకు 129.2 ఓవర్లలో 444 పరుగులకు ఆలౌటైంది. లోయర్‌ ఆర్డర్‌ సహకారంతో మెహదీ హసన్‌ మిరాజ్‌ శతకంతో చెలరేగిపోయాడు.

చివర్లో అతడికి తైజుల్‌ ఇస్లామ్‌ (20), తన్జీమ్‌ హసన్‌ (80 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్‌) సహకరించారు. మెహదీ హసన్‌ దూకుడుతో ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగుల ఆధిక్యం లభించింది. జింబాబ్వే బౌలర్లలో విన్సెంట్‌ మసెకెసా 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జింబాబ్వే 46.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది.

జింబాబ్వే ఓపెనర్‌ బెన్‌ కరన్‌ (103 బంతుల్లో 46; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... కెప్టెన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌ (25), వెల్లింగ్టన్‌ మసకద్జ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన మెహదీ హసన్‌ మిరాజ్‌... బంతితోనూ విజృంభించి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇతరుల్లో తైజుల్‌ ఇస్లామ్‌ 3 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దుమ్ములేపిన మిరాజ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

టెస్టుల్లో 2068 రన్స్‌, 205 వికెట్లు
కాగా ఖుల్నాకు చెందిన మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. కుడిచేతి వాటం బ్యాటర్‌ అయిన అతడు రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌. 2016లో బంగ్లాదేశ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మెహదీ హసన్‌ మిరాజ్‌.. ఇప్పటి వరకు 53 టెస్టులు, 105 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

టెస్టుల్లో 2068 పరుగులు చేయడంతో పాటు 205 వికెట్లు తీశాడు. అదే విధంగా.. వన్డేల్లో 1617 పరుగులు సహా 110 వికెట్లు.. టీ20లలో 354 పరుగులు సహా 14 వికెట్లు మెహదీ హసన్‌ మిరాజ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో రెండు, వన్డేల్లో రెండు శతకాలు సాధించాడు.

చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్‌.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement